పార్టీకి దూరమయ్యేలా సీనియర్ల ఎత్తుగడలు
తుల ఉమ, రవీందర్ రెడ్డిలను అవమానించిన నేతలు
టికెట్లు వచ్చిన నేతలను ఓడించేందుకు కుట్రలు
బిసి ఆత్మగౌరవ సభ, మాదిగల విశ్వరూపం సభ సక్సెస్
ఒక్కసారిగా ఈటెలకు హస్తిన పెద్దల వద్ద పెరిగిన ఇమేజ్
దెబ్బతీసేందుకు కొందరు నాయకుల ప్రయత్నాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా భారతీయ జనతా పార్టీల్లో అధిపత్య పోరు చాపకింది నీరుల్లా సాగుతుంది. సూర్యాపేట సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా బిసి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నాటి నుంచి ఆపార్టీకి చెందిన కొందరు సీనియర్లు ఆ నినాదం పార్టీ తీసుకోవడం జీర్ణించుకోలేక పోతున్నారు. ఊహించని విధంగా పార్టీ కొత్త విధానాలు తీసుకోవడంతో ఇన్నాళ్లు పార్టీలో పెత్తనం చెల్లాయించిన నేతలు తమ అధిపత్యానికి గండిపడుతుందని అంచనా వేస్తూ బిసి నేతలకు సీట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో వారిని ఓడించేందుకు పాత క్యాడర్ వారికి సహకరించకుండా కుట్రలు చేస్తున్నారు.
పార్టీలో కొత్త మార్పు రావడానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రధాన కారణంగా భావిస్తూ ఆయన అనుచరులు పార్టీ వీడేలా అవమానాలకు గురి చేస్తున్నారు. రెండేళ్ల కితం ఆయన పార్టీలో చేరినప్పుడు సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి, తుల ఉమ కూడా కాషాయం కండువా కప్పుకుని బిజెపి రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు తమ వంతు పాటుపడుతామని పేర్కొని ఆదిశగా పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. పార్టీకి కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో గుర్తించిన కమలం సీనియర్లు వలసల పెత్తనం పెరిగిపోతుందని భావించి వారు సభలకు, సమావేశాలకు వస్తే దూరంగా ఉంచుతూ మీతో పార్టీకి పెద్దగా ఒరిగేదిలేదని విమర్శలు చేసేవారు.
పలుమార్లు పార్టీ పెద్దల తీరును చూసి కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ వీడే సమయంలో రవీందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెటు తెచ్చుకున్నాడు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకులు తుల ఉమ కూడా ఈటెల రాజేందర్ టికెట్ ఇప్పిస్తానని భరోసా ఇవ్వడంతో ఎన్ని అవమానాలు ఎదురైన భరిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇటీవల చివరి జాబితాలో ఆమెకు వేములవాడ టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటన చేసిన తీరా నామినేషన్ల వేసే సమయానికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ కుమారుడు వికాస్‌రావుకు భి-పామ్ ఇచ్చి ఆమెకు తీరని ద్రోహం చేశారు. వీరిద్దరు పార్టీ వీడిన మరికొందరు నేతలు ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచారు. వీరు కూడా ఓటమి చెందాలని ఎత్తులు జిత్తులు వేస్తూ వారి విజయం సాధించకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో విమర్శలు వస్తున్నాయి. పాత క్యాడరంతా పాత నాయకులకే సహకరించాలని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు అంటిముట్టనట్లుగా ఉండాలని సంకేతాలు ఇస్తున్నట్లు ఈటెల రాజేందర్ అనుచర వర్గం మండిపడుతోంది.
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఈటెల బిసి ఆత్మగౌరవ సభతో పాటు ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలతో కలిసి మాదిగల విశ్వరూపం సభ ఏర్పాటు చేసి సక్సెస్ చేయడంతో ఈటెల రాజేందర్‌కు హస్తిన పెద్దల వద్ద మరింత ఇమేజ్ పెరిగింది. ఆయన సూచించిన విధంగానే హైకమాండ్ ముందుకు వెళ్లుతుంది దీని గుర్తించి బిజెపి సీనియర్లు ఆయనకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతను చెక్ పెట్టేందుకు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తున్నట్లు పార్టీలో రెండు రోజులుగా చర్చ నడుస్తుంది. బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రాకున్న పర్వాలేదు కానీ ఈటెల రాజేందర్‌కు పార్టీలో ప్రాధాన్యత ఉండదని కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.