Sunday, July 7, 2024

అధికార పార్టీలదే మళ్లీ పీఠం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) అరుణాచల్ ప్రదేశ్ వరుసగా రెండవ సారి అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్లుకున్నది. రాష్ట్రంలోని 60 సీట్లలో బిజెపి 46 సీట్లను కైవసం చేసుకున్నది. ఎన్నికల కమిష న్ (ఇసి) డేటా ప్రకారం, సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని 32 సీట్లలో 31 సీట్లను ఎస్‌కెఎం గెలుచుకున్నది. ప్రత్యర్థి పక్షం సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రం ట్ (ఎస్‌డిఎఫ్)కు కేవలం ఒక్క సీటు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బి జెపి ఇంతకు ముందే పది సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకున్నది. మిగతా సీ ట్లకు వోట్ల లెక్కింపు ఆదివారం ఉదయం మొదలైంది. నేషనల్ పీపుల్స్ పా ర్టీ (ఎన్‌పిపి) ఐదు సీట్లను, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ) రెండు సీట్లను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మూడు సీట్లు,

కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోగా ఇండిపెండెంట్లకు మూడు సీట్లు లభించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి మెజారిటీ మార్క్  దాటగానే వేడుకలు మొదలయ్యాయి. సిక్కింలో కూడా ఎస్‌కెఎం పునర్విజయానికి పార్టీ కార్యకర్తలు పాడుతూ, చప్పట్లు కొడుతూ వేడుకలు చేసుకున్నారు. ‘బిజెపిపై తిరిగి నమ్మకం కలిగి ఉన్నందుకు’ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ’ఎక్స్’ పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ మరొక పోస్ట్‌లో సిక్కింలో విజయం సాధించిన ఎస్‌కెఎంను, ఆ పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ తమంగ్‌ను అభినందించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. సిక్కింలో 79.88 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 82.95 శాతం పోలింగ్ నమోదైంది. సిక్కింలో బిజెపి, కాంగ్రెస్ కూడా పోటీ చేశాయి కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.

పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన సిక్కిం మాజీ సిఎం చామ్లింగ్
ఐదు సార్లు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌డిఎఫ్ చీఫ్ పవన్ చామ్లింగ్ తాను పోటీ చేసిన పోక్లోక్ కమ్రంగ్, నమ్చెయ్‌బుంగ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓడిపోయారని అధికారులు తెలిపారు. ఎనిమిది సార్లు ఎంఎల్‌ఎ చామ్లింగ్ తన సొంత నామ్చి జిల్లాలోని పోక్లోక్ కమ్రంగ్ నియోజకవర్గంలో 3063 వోట్ల తేడాతో ఎస్‌కెఎ అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో ఓడిపోయారు. నమ్చెయ్‌బుంగ్ నియోజకవర్గంలో చామ్లింగ్ ఎస్‌కెఎం అభ్యర్థి రాజు బస్నెట్ చేతిలో 2256 వోట్ల తేడాతో ఓడిపోయారు. చామ్లింగ్ 1994 నుంచి 2019 వరకు 25 ఏళ్లు సిక్కిం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, చామ్లింగ్ ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోవడం 39 ఏళ్లలో ఇదే మొదటిసారి.

ఫుట్‌బాల్ దిగ్గజం భూటియా పరాజయం
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ సారథి, ఎస్‌డిఎఫ్ ఉపాధ్యక్షుడు భాయిచుంగ్ భూటియా నామ్చి జిల్లా బార్ఫుంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌కెఎం అభ్యర్థి రిక్షల్ దోర్జీ భూటియా చేతిలో ఓడిపోయారు. ఎస్‌కెఎం అభ్యర్థికి 8358 వోట్లు రాగా, భూటియాకు 4012 వోట్లు వచ్చాయి. భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్‌డిఎఫ్‌లో చేరారు. భూటియా పూర్వపు హమ్రో సిక్కిం పార్టీని ఎస్‌డిఎఫ్‌లో విలీనం చేశారు.

అరుణాచల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ సీట్లలోకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని వెల్లడించింది. ఎన్నికల ఫలితాల పట్ల పార్టీ ‘నిరాశ చెందింది’ కానీ ‘స్థైర్యం కోల్పోలేదు’ అని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు నబమ్ తుకి చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 19 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కానీ తూర్పు కమెంగ్ జిల్లాలోని బమెంగ్ సీటును మాత్రమే పార్టీ గెలుచుకుంది. పార్టీ ‘ప్రజల తీర్పును బాధ్యత భావంతో వినమ్రంగా అంగీకరించింది’ అని తుకి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ‘పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది కానీ ధైర్యాన్ని కాదు. కాంగ్రెస్ కష్టించి పని చేస్తుంది. ప్రజల హక్కుల కోసం, దేశం లక్షాల కోసం అదే బాధ్యతతో పోరాటాన్ని కొనసాగిస్తుంది’ అని తుకి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News