మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపిపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శలతో మరోసారి విరుచుకుపడ్డారు. బిజెపి నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని కెటిఆర్ ప్రశ్నించారు. విద్వేషం నింపుతున్న బిజెపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రవక్త మహమ్మద్‌పై ఇప్పుడు బహిష్కరణకు గురైన, సస్పెండ్ చేయబడిన బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పాలని గల్ఫ్ దేశాలు ఆదివారం డిమాండ్ చేశాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు, బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి పలు సూటీ ప్రశ్నలు సంధించారు. ‘బిజెపి మతోన్మాదుల ద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ, ఒక దేశంగా భారతదేశం కాదు’ అని అన్నారు. ‘నిత్యం విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నందుకు మీ పార్టీ (బిజెపి) ముందుగా దేశంలోని ప్రజలకు, భారతీయులకు క్షమాపణ చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.