Friday, November 15, 2024

బిసి బిల్లు ప్రవేశపెట్టి బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా బిసి బిల్లు పెట్టి బిజెపి పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నబిసి వర్గాలకు చెందిన ప్రజల ప్రాతినిధ్యం ఇప్పటివరకు చట్టసభల్లో 10 శాతం కూడా లేదన్నారు. ఈ వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే కేవలం రిజర్వేషన్లు ఉంటేనే సాధ్యమవుతుందని అందుకోసం కేంద్రంలోని బిజెపి పార్టీ రానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టి రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల తమ పాలనలో బిసి వర్గాల సంక్షేమం కోసం చేసింది ఏమి లేదని కిశోర్ గౌడ్ అన్నారు.

ఎన్ని సార్లు అడిగినా కూడా బిసిల కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి 9 సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. బిసిల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల కోసం 300లకు పై చిలుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.

మరోసారి బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చట్టసభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని లేఖ రాయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, బిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో బిసి వర్గాల ప్రజలు ఓటు ద్వారా బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని కిశోర్ గౌడ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News