సంకీర్ణాలు మనకు అచ్చిరావు
మోడీ ప్రధానిగా తప్పుకోవాలి
సుబ్రమణియన్ స్వామి సూచన
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి గురువారం సూచించారు. 1989-90, 1998–2004 లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీవ్ర నష్టాన్ని చవిచూసిందని తన వాదనకు బలాన్ని చేకూరుస్తూ ఆయన ఉదాహరణలు చూపించారు. అందువల్ల బిజెపి ప్రతిపక్షంలో కూర్చుని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని మట్టికరిపించాలని ఆయన ఎక్స్ వేదికగా తన పార్టీ నాయకత్వానికి సలహా ఇచ్చారు. తన నాయకత్వంఓలో బిజెపి మెజారిటీ మార్కు 272 దాటడంలో విఫలం అయిన కారణంగా ప్రధాని మోడీ పదవి నుంచి తప్పుకోవాలని కూడా ఆయన మరో ట్వీట్‌లో సూచించారు. మెజారిటీ మార్కు 272 దాటకుండా 240 స్థానాలకే బిజెపి పరిమితమైనందు వల్ల ప్రధాని మోడీ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మగౌరవం ఉన్న ఏ నాయకుడైనా రాజీనామా చేయాల్సిందేనని, మెడపట్టి గెంటేంతవరకు ఎదురుచూడరని కూడా ఆయన పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు.