Tuesday, November 5, 2024

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారి పోయారని ఆరోపించింది. స్వయం కృషితో ఎదిగిన మహిళల పట్ల రాహుల్ భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నారంటూ విమర్శలు గుప్పించింది. ఉత్తరప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు.

జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు, బిలియనీర్లను మాత్రమే బీజేపీ ఆహ్వానించిందని, కానీ దేశంలో 73 శాతం జనాభా కలిగిన ఓబీసీ, దళిత లేదా గిరిజన వర్గాలకు చెందిన వారిని పిలవలేదని రాహుల్ విమర్శించారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఓబీసీ వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా కనిపించలేదని, అక్కడ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ప్రధాని నరేంద్రమోడీ, ఉన్నారని పేర్కొన్నారు. తాను ఒక రైతుని కానీ, కార్మికుడిని కానీ, చిరువ్యాపారిని కానీ ఆ కార్యక్రమంలో చూడలేదని చెప్పుకొచ్చారు. టెలివిజన్ ఛానెళ్లు కేవలం ఐశ్వర్యరాయ్ డ్యాన్సింగ్ వీడియోలే చూపిస్తాయని , పేద ప్రజల గురించి ఏమీ చూపించవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి.

బీజేపీ తీవ్ర స్పందన
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ , భారతీయుల నిరంతర తిరస్కరణలతో విసుగు చెందిన రాహుల్ గాంధీ , భారత్ గర్వించే ఐశ్వర్యను కించపరిచే స్థాయికి దిగజారారని, ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంతవరకూ ఒక్క విజయం సాధించని రాహుల్, దేశానికి ఎంతోకీర్తిని తెచ్చిన ఐశ్వర్యపై దూషణలకు దిగారని, ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్ధరామయ్య, సాటి కన్నడ వ్యక్తిపై రాహుల్ చేసిన అవమానకరం వ్యాఖ్యల్ని ఖండిస్తారా ? లేక సిఎం కుర్చీని కాపాడుకోవడం కోసం మౌనంగా ఉంటారా ? అని ప్రశ్నించింది. ప్రముఖ గాయని సోనామహాపాత్ర కూడా రాహుల్‌పై మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం రాజకీయనేతలు మహిళలను కించపర్చడం సమంజసం కాదని సూచిస్తూ ఐశ్వర్యకు మద్దతు తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News