ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి దాదాపు రెండు దశాబ్దాల పాటు ‘నిమ్మకాయ వలె రాష్ట్రాన్ని పిండేసింది’ అని, నిరుపేద రాష్ట్రాల వెన్ను ‘విరుస్తోంది’ అని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ‘ఎంఎల్‌ఎలు, ఎంపిలను వేటాడుతూ, ప్రభుత్వాలను కూలుస్తూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను’ సృష్టించడం ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్రం దేశ ఫెడరల్ వ్యవస్థను ‘నాశనం చేస్తోంది’ అని కూడా ఆయన ఆరోపించారు. ‘బిజెపి గడచిన 20 సంవత్సరాల్లో ఝార్ఖండ్‌ను ఒక నిమ్మకాయలా పిండేసింది. అయితే, ఇది ఇప్పుడు ముగియవలసి ఉంది. మేము ఆవును మేపుతున్నాం, వారు పాలు పిసుకుతున్నారు.
దీనిని ఇక ఎంత మాత్రం అనుమతించేది లేదు,. వారు ఝార్ఖండ్ సంపదను కొల్లగొట్టారు. ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఝార్ఖండ్ నిరుపేద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండడం విడ్డూరం’ అని హేమంత్ సోరెన్ ‘పిటిఐ’ ఇంటర్వూలో వ్యాఖ్యానించారు. ‘మేము బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, డోలోమైట్ వనరుల్లో సంపన్నులం. కానీ కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి వ్యవస్థ మా రెవెన్యూ వసూలుకు గండి కొడుతోంది. అది ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల వెన్ను విరిచింది. మా ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అది చేసిందేమీ లేదు’ అని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి పదే పదే రాసినప్పటికీ రాష్ట్రానికి రావలసిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలను ఇంకా విడుదల చేయవలసి ఉందని సోరెన్ తెలిపారు.