Thursday, January 23, 2025

రాహుల్ గాంధీ ఎదుర్కొనబోయే లోక్‌సభ బహిష్కరణ రూల్స్ ఏమిటి?

- Advertisement -
- Advertisement -
యుకెలో చేసిన ప్రసంగం కారణంగా రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అసలు నియమాలు(రూల్స్) ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.

న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్(యుకె)లో భారత్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్న దానిపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. అలాగే లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తే వివరిస్తానని కూడా రాహుల్ గాంధీ తెలిపారు. ‘అధికారానికి మించి’(బియాండ్ ప్రివిలేజ్)గా పేర్కొంటూ లోక్‌సభ నుంచి వయనాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని బిజెపి ఇటీవల కోరింది.
‘దేశానికి సంబంధించిన ఏదైనా విషయం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్‌కు లేదా దాని నాయకత్వానికి ఏమి జరుగుతుందో మేము పట్టించుకోము. కానీ అతను దేశాన్ని అవమానిస్తే, మేము మౌనంగా ఉండలేము’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇదివరలో అన్నారు.

అదేవిధంగా, కేంద్ర మంత్రి నిశికాంత్ దూబే లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమాల నిబంధన 223 కింద లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ ‘ధిక్కార’ వ్యాఖ్యలపై విచారణ జరిపి, ఆయనను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని కోరారు. రూల్ 223(పార్లమెంటరీ) ప్రత్యేక హక్కు గురించి చర్చిస్తుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మూడు అధికారాలను ఉల్లంఘించారని ప్రివిలేజెస్ కమిటీ ముందు దూబే వాదించారు.

పార్లమెంటరీ ప్రత్యేకాధికారం అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 పార్లమెంటు ఉభయ సభలు, కమిటీలు, వాటి సభ్యులు అనుభవించే ప్రత్యేక హక్కులు, మినహాయింపులు, ఇమ్యూనిటీస్‌ను ‘పార్లమెంటరీ అధికారాలు’ అంటారు. ఈ నిబంధన పార్లమెంటరియన్‌లకు వారి పదవీ కాలంలో క్రిమినల్ కానటువంటి ఏదేనీ ప్రకటన లేదా చర్య కారణంగా నేర విచారణకు ఆస్కారం ఇవ్వకుండా మినహాయింపును ఇస్తుంది.
పార్లమెంటేరియన్లు అనుభవించే నాలుగు ప్రధాన అధికారాలు: పార్లమెంట్‌లో వాక్ స్వాతంత్య్రం, అరెస్టు కాకుండా స్వేచ్ఛ, ప్రొసీడింగ్‌ల ప్రచురణను నిషేధించే హక్కు , అపరిచితులను(సభలో సభ్యులు కానివారు) దూరంగా(ఎక్స్‌క్లూడ్)పెట్టే హక్కు. అధికార ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలిన ఏ పార్లమెంటేరియన్‌కైనా శిక్ష దాని తీవ్రతను బట్టి హెచ్చరిక నుంచి జైలు శిక్ష వరకు ఉంటుంది.
223 నియమం అంటే ఏమిటి?
ఈ నియమం సభ్యుడు లేదా కమిటీ చేసిన ప్రత్యేక హక్కును ఉల్లఘించిన విషయంపై పార్లమెంటు స్పీకర్ సమ్మతితో (రూల్ 222కింద) ప్రశ్నను లేవనెత్తడానికి సభ్యుడికి అనుమతిస్తుంది. ఈ విషయంపై చర్చించిన తర్వాత, తదుపరి విచారణ, నివేదిక కోసం స్పీకర్ కేసును ప్రత్యేకాధికారాల కమిటీ(కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్)కి సూచించవచ్చు. ఈ కమిటీని స్పీకరే ఏర్పాటు చేస్తారు.
రాహుల్ గాంధీని బహిష్కరిస్తారా?
గతంలో నాటి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి 1976లో యుకె, యుఎస్, కెనడాలో భారత దేశానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలకు గాను సభ నుంచి బహిష్కరింపబడ్డాడు.
ముందస్తు నోటీసు లేకుండా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ రూల్ 352ను ఉల్లంఘించారని కేంద్ర మంత్రి దూబే ఆరోపించారు. రాహుల్ గాంధీ లండన్‌లో ‘అబద్ధం’ చెప్పారని, దేశాన్ని ‘అవమానించారు’ అని, ‘భారత వ్యతిరేక శక్తులకు మరింత మేత వేశారు’ అని కేంద్ర మంత్రి రిజిజు ఆరోపించారు. ఈ దావాలు(క్లెయిమ్స్) దేశద్రోహం(సెడిషన్)ను నిర్వచించే భారతీయ శిక్షాస్మృతి(ఐపిసి)లోని సెక్షన్ 124ఏకి లోబడి ఉండొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News