Wednesday, January 22, 2025

సందేశ్‌ఖాలీపై బీజేపీ డబ్బుతో అవాస్తవాల ప్రచారం: మమతా

- Advertisement -
- Advertisement -

బోల్‌పూర్ (పశ్చిమబెంగాల్): బీజేపీ డబ్బుతో సందేశ్ ఖాలీపై అవాస్తవాలను ప్రచారం చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ “మొసలి కన్నీరు” కార్చవద్దని సూచించారు. ఈ విషయంలో కాషాయం పార్టీ కుట్ర బయటపడిందని వ్యాఖ్యానించారు. శనివారం టిఎంసి సోషల్ మీడియా లో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో బీజేపీ మండలాధ్యక్షుడుగా చెబుతున్న ఓ వ్యక్తి సందేశ్‌ఖాలీ మొత్తం కుట్ర వెనుక అసెంబ్లీ విపక్ష నేత సువేందు అధికారి ఉన్నారని చెప్పడం వినిపించింది.

అయితే ఈ వీడియో అధికారిత ఎంతవరకో ఎవరూ తనిఖీ చేయలేదు. ఆ వీడియోలో ఆ వ్యక్తి షాజహాన్ షేఖ్‌తోపాటు ముగ్గురు టిఎంసినేతలపై ముగ్గురు నలుగురు స్థానిక మహిళలు అత్యాచార ఆరోపణలు చేసేలా ప్రేరేపించాలని సువేందు అధికారి తమను రెచ్చగొట్టినట్టు చెప్పడం వినిపించింది. బోల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టిఎంసి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శతాబ్దిరాయ్‌కి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ పచ్చి అబద్దాలను పుట్టించే బీజేపీ అబద్ధాలు చెప్పాలని కొందరికి డబ్బు ఇచ్చి ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు.

సందేశ్‌ఖాలీ పై ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి బీజేపీ ఇంత నీచానికి దిగజారుతుందని ఎవరైనా అనుకుంటారా ? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి హేయమైన ఆరోపణలతో పశ్చిమబెంగాల్ తల్లులను అగౌరవపర్చవద్దు. తమ పార్టీపై బూటకపు ఆరోపణలు చేయడానికి రాష్ట్ర మహిళలకు డబ్బు ముట్ట చెప్పి అగౌరవ పర్చడానికి సాహసించవద్దని మమతా బెనర్జీ హెచ్చరించారు. మోడీ తన పార్టీ లోని ఎవరో కొద్ది మంది మాటలను పట్టుకుని ఆరోపిస్తున్నారని విమర్శించారు. వీడియోను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏదెలాగైనా టిఎంసి నేతలైనా మరెవరైనా వారెంత శక్తివంతులైనా తప్పు చేస్తే సత్వరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News