బిజెపితో భారత్‌కు సంకట స్థితి
మోడీ సర్కారు క్షమాపణ చెప్పితీరాలి
భారత్‌పై తీవ్రస్థాయిలో ముస్లిం దేశాల డిమాండ్
గల్ఫ్ దేశాలకు తోడుగా పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్
ఇండియా మాల్ వెలి షురూ సరుకు బయటకు
పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: బిజెపి అధికార ప్రతినిధులు ఇద్దరు మహ్మద్ ప్రవక్తను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశానికి విషమ పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ప్రత్యేకించి అన్ని విధాలుగా అత్యంత కీలకమైన గల్ఫ్‌దేశాలలో భారత్ పట్ల రగులుతోన్న ఆగ్రహావేశాలు విస్తరిస్తున్నాయి. కువైట్‌లో ఓ సూపర్‌మార్కెట్‌లో సోమవారం భారతీయ సరుకులను బయటకు తరలించారు. భారతీయ సరుకులను తాము బయటకు పంపిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు సోమవారం సౌదీ అరేబియా, బహరైన్, అఫ్ఘనిస్థాన్‌లు ఇతర ముస్లిం దేశాల బాటలోనే బిజెపి వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. బిజెపి అధికార ప్రతినిధుల వ్యాఖ్యలు గర్హనీయంగా ఉన్నాయని, వీటిని ఖండిస్తున్నామని తెలిపింది. ఇస్లామిక్ మత ప్రతినిధులు లేదా ప్రతీకలపై విద్వేషపూరిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఏ మతం పట్ల అవమానకరమైన వ్యవహారశైలిని తాము అంగీకరించేది లేదని తెలిపారు. బిజెపి అధికార ప్రతినిధులపై చర్యలను స్వాగతిస్తున్నామని, అయితే సౌదీ రాజ్యం తమ వైఖరిని స్పష్టం చేస్తోందని, విశ్వాసాలు, మతాలను అంతా గౌరవించాలనేదే తమ విధానం అని తెలిపింది. మరో వైపు అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కూడా భారత ప్రభుత్వానికి నిరసన తెలిపింది. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల నాయకత్వంలోని తాత్కాలిక ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ తరఫున ప్రకటన వెలువరించారు. భారత్‌లో అధికార పార్టీ ప్రతినిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. పాకిస్థాన్‌లో అధికారులు సోమవారం ఇస్లామాబాద్‌లోని భారతీయ వ్యవహారాల అధికార ప్రతినిధిని పిలిపించి, తమ దేశ పూర్తి స్థాయి ఖండనను వెలువరించారు. ఇస్లామ్ ప్రతినిధికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలను తాము గర్హిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్‌కు నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ముస్లిం దేశాలు ఇప్పటికే భారత రాయబారులను పిలిపించి బిజెపి ప్రతినిధుల వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించాయి. అయితే ఈ వ్యాఖ్యలకు తమ ప్రభుత్వానికి కానీ పార్టీకి కాని సంబంధం లేదని బిజెపి చెప్పింది. పైగా ఆ అధికార ప్రతినిధులిద్దరిపైనా వేటు వేశామని, భారతదేశంలో అన్ని మతాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపింది. అయితే ప్రభుత్వం తరఫున ఈ వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో వివరణతో సరిపోదని, అంతకు మించి తమకు ప్రత్యేకించి ముస్లిం వర్గాలకు పూర్తి స్థాయిలో క్షమాపణలు కావాల్సి ఉందని కొన్ని ముస్లిం దేశాలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడైయింది. ఇప్పటికే ఓ బిజెపి అధికార ప్రతినిధిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు , మరొక్కరిని సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇలు ఇప్పటికే భారత ప్రభుత్వం పట్ల నిరసన బాటపట్టాయి. ఇక అత్యంత శక్తివంతమైన ఇరాన్, యుఎఇలు ప్రభుత్వం నుంచి తమకు క్షమాపణ అందాల్సి ఉందని తెలిపాయి. తమకు ప్రాణప్రదమైన మహ్మద్ ప్రవక్తను తూలనాడే పదాలను వాడటం అధికార పార్టీ ప్రతినిధులకు తగునా అని ఆయా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ వత్తాసును చూసుకునే అధికార పార్టీ ప్రతినిధులు ముస్లిం మత ప్రవక్తపై దూషణలకు దిగే ధైర్యాన్ని సంతరించుకున్నారని, లేకపోతే వారు ఇంతకు బరితెగిస్తారా? అని ముస్లిం దేశాలు ప్రశ్నిస్తున్నాయి.
రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ
దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసేందుకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధులు విశేషరీతిలో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ అభిప్రాయాలను బిజెపి ప్రతినిధులు వ్యక్తం చేయలేదని, అది ఓ చర్చాగోష్టి దశలో ఇతరత్రా అంశాల మధ్య ప్రస్తావనకు వచ్చిన వ్యక్తిగత అంశం అని విదేశాంగ శాఖ వివిధ ముస్లిం దేశాలకు తమ వివరణను తెలిపింది. ఖతార్‌లో భారత రాయబారి దీపక్ మిట్టల్ స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి అన్వయించుకోరాదని కోరుతున్నామని, అత్యల్ప అభిప్రాయాలుగా పరిగణించాల్సి ఉందని తెలిపారు.
ఆర్థిక సంబంధాలకు విఘాతం ః ఖతార్
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చుకోవాలి. మోడీ ప్రభుత్వం దీనిపై బహిరంగంగా ప్రకటనకు దిగాలి. ప్రత్యేకించి తమ మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలను తాము సహించేది లేదని న్యూఢిల్లీలో ఉన్న ఖతార్ ఎంబసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే ఇప్పటివరకూ ఎంతో సజావుగా ఉన్న భారత్ ఖతార్ సంబంధాలు ప్రత్యేకించి కీలకమైన ఆర్థిక లావాదేవీలకు ముప్పు ఏర్పడుతుందని ఈ సీనియర్ అధికారి హెచ్చరించారు. బిజెపి అధికార ప్రతినిధులు నుపూర్ శర్మను సస్పెండ్ చేశారు. నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
గల్ఫ్‌దేశాలతో భారత వ్యాపారం 90 బిలియన్ డాలర్లు
భారతదేశానికి చెందిన పలువురు కార్మికులు, పలు ఉద్యోగ వర్గాలు కువైత్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇలలో వివిధ స్థాయిల ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన గల్ఫ్ సహకార మండలి (జిసిసి)తో భారతదేశ వివిధ రకాల వ్యాపారం 202021లో దాదాపు 90 కోట్ల డాలర్ల వరకూ పలికింది. జిసిసి దేశాలను నమ్ముకుని భారతీయులు అనేకులు బతుకు వెళ్లదీస్తున్నారు. సకాలంలో బిజెపి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఫలితాలను ఇవ్వకపోతే ఈ కోట్లాది మంది భారతీయులకు పలు దేశాలలో చిక్కులు తప్పవనే ఆందోళన వ్యక్తం అయింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ప్రధాని నరేంద్ర మోడీ గత కొంతకాలంగా ఇంధన సంపన్నయుత ఇస్లామిక్ దేశాలతో పూర్తి స్థాయి ఆర్థిక సంబంధాల బలోపేత దిశలో చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి ఆయా దేశాల నుంచే ఎక్కువగా ముడిచమురు దిగుమతులు జరుగుతున్నాయి.
BJP Staff comments against Muhammad Pravakta