కెసిఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రానికి డిమాండ్!!
మహబూబ్‌నగర్: తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్‌నగర్‌లో ఆరంభమయ్యాయి. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి మంగళవారం బిఆర్‌ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. ‘కెసిఆర్ కుటుంబానికి 2014లో ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత’ అన్న దానిపై శ్వేత పత్రాన్ని డిమాండ్ చేశారు. జివో 317 కారణంగా ఎదురవుతున్న టీచర్ల, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను జనవరి 30 వరకు పరిష్కరించాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ గడువులోపల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిష్కరించకుంటే హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపడతామని హెచ్చరించారు. ‘కెసిఆర్ ఈ అంశంపై మా నుంచి తప్పించుకోలేరు. రజాకార్ల కాలంలో మహిళా టీచర్లు , వారి పిల్లలను రజాకార్లు ఎలా హింసించారలో అలాంటి వాతావరణాన్ని నేడు మేము చూస్తున్నాము’ అని ఆయన రెచ్చిపోయారు.
‘యావత్ తెలంగాణ సమస్యల్లో చిక్కుకుని ఉంది. అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రతి కుటుంబంపై రూ. 6 లక్షల అప్పు భారాన్ని, రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల మేరకు దివాలా తీయించారని’ అని సంజయ్ తెలిపారు.