ఠాణె: లోక్‌సభ ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడం ద్వారా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ‘సర్జికల్ దాడి’ జరిపిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ శనివారం ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం తద్వారా ‘పన్ను ఉగ్రవాదం’ ద్వారా కాంగ్రెస్‌కు ‘ఆర్థిక చిక్కులు’ సృష్టించిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఠాణె నుంచి ముంబయిలోకి ప్రవేశించిన సందర్భంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడిన జైరామ్ రమేష్ కేంద్ర ప్రభుత్వ ‘ఒక దేశం ఒక ఎన్నిక’ విధానాన్ని ఆక్షేపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షం ‘ఒక దేశం ఎన్నిక రహితం’గా మార్చడమే అని ఆయన ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా అనేదే 2024లో భయం అని రమేష్ అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులను అధికార పార్టీ అక్రమంగా సేకరిస్తున్నదని, ‘విరాళం ఇవ్వు, వ్యాపారం తీసుకో’ అజెండాతో బోగస్ సంస్థలను ఆ పార్టీ ఉపయోగించుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ‘బిజెపి ఇప్పుడు బాండ్ జనతా పార్టీ.
ఎన్నికల బాండ్ల గురించి దిగ్భ్రాంతి కలిగించే మరింత సమాచారం రాగలదు’ అని ఆయన చెప్పారు. రూ. 210 కోట్ల ఆదాయపు పన్ను (ఐటి) డిమాండ్‌పై కాంగ్రెస్ ప్రధాన బ్యాంకు ఖాతాలను క్రితం వారం స్తంభింపచేశారు. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభన ద్వారా కాంగ్రెస్‌పై బిజెపి సర్జికల్ దాడి జరిపింది. ఎన్నికలలో పోరాడేందుకు లేదా మా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యేందుకు మాకు డబ్బు లేదు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించిన డబ్బును కూడా ఉపయోగించలేము. పన్ను ఉగ్రవాదం ద్వారా కాంగ్రెస్‌కు ఆర్థికంగా వైకల్యం కలిగించారు’ అని రమేష్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ యాత్రలు రెండూ పార్టీ వ్యవస్థకు, దేశానికి మంచివేనని, వేలాది మంది ప్రజలు యాత్రల్లో పాల్గొన్నారని రమేష్ తెలిపారు. ‘రాహుల్ గాంధీ దేశంలో 6000 కిలో మీటర్లు తిరిగారు. అది బిజెపి రూ. 6000 కోట్ల ఎన్నికల బాండ్లకు, కాంగ్రెస్ 6000 కిలో మీటర్లకు మధ్య పోటీ. ఆయన రెండవ యాత్ర జనవరి 14న ఇంఫాల్‌లో మొదలై శనివారం ముంబయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం చైత్య భూమి వద్ద ముగిసింది’ అని రమేష్ చెప్పారు. యాత్రను ఒక రాజకీయ పార్టీ చేపట్టిన సైద్ధాంతిక ప్రక్రియగా రమేష్ పేర్కొన్నారు.