ధామి పట్టంపై తేల్చని నాయకత్వం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో బిజెపి విజయం సాధించినా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఉత్కంఠతనే మిగిల్చింది. ఎన్నికలలో పార్టీని విజయం వైపు నడిపించిన ఇంతకు ముందటి సిఎం పుష్కర్ సింగ్ ధామి సొంత నియోజకవర్గం ఖట్కార్‌లో స్వల్ప తేడాతోనే ఓడారు. ఆయన ఇకపై కూడా సిఎంగా ఉండేందుకు బిజెపి నాయకత్వం అవకాశం కల్పిస్తుందా? కొత్త వారిని ఎంచుకుంటుందా? అనేది వెల్లడికాలేదు. విజయం సాధించిన మిగిలిన రాష్ట్రాలలో బిజెపి తదుపరి సిఎంలు ఇప్పటికే ఖరారయ్యారు. వారి ప్రమాణస్వీకార తేదీలు కూడా ఖరారు అవుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌లో ఈ విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. సిఎం కొత్తవారు అయితే ఎవరు అవుతారనే అంశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీరిలో చౌబట్టకాహల్ ఎంఎల్‌ఎ సత్పాల్ మహారాజ్ , మాజీ సిఎం త్రివేదా సింగ్ రావత్ , దిదిహత్ లెజిస్లేటర్ బిషన్ సింగ్ చుఫాల్, శ్రీనగర్ గర్వాల్ ఎమ్మెల్యే ధన్‌సింగ్ రావత్ పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో మాజీ సిఎం త్రివేదా సింగ్ రావత్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు. తాను సిఎం పదవికి బరిలో లేనని , ఎన్నికలలో పోటీ చేసి ఉంటే ఈ రేస్‌లో ఉండేవాడినని ఇప్పుడు తన పేరు తీసుకురావడం ఎందుకు అని ప్రశ్నించారు.
కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ప్రస్తుత కేంద్ర మంత్రి అజయ్ భట్, రాజ్యసభ ఎంపి అనిల్ బలూని పేర్లు కూడా సిఎం స్థానానికి విన్పిస్తున్నాయి. అయితే సిఎం ఎవరనే అంశంపై ఈ విధంగా ఊహాగానాలు రావడం సహజమే అని, అయితే ఇంతవరకూ పార్టీ అధినాయకత్వంపై దీనిపై తమకు ఎటువంటి స్పష్టత లేదని ఉత్తరాఖండ్ బిజెపి వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు సమావేశం అయి, నేతను ఎన్నుకోవడం ఆనవాయితీ అవుతుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మదన్ కౌశిక్ తెలిపారు. ఆయన హరిద్వార్ స్థానం నిలబెట్టుకున్నారు. ధామి అంశం గురించి ప్రస్తావిస్తూ ఆయన సీటు పోయింది కానీ పార్టీకి విజయం తెచ్చిపెట్టారని, అందరి మన్ననలు పొందారని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ విజయం వెనుక ధామి కీలక పాత్ర ఉందని, ఆయన యువ, సమర్థ నాయకత్వం పార్టీకి మేలు చేసిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రశంసించారు.