Wednesday, January 22, 2025

మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్‌ల్యాండ్‌పై తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉండవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించవచ్చని అన్ని ఎగ్జిట్‌పోల్ అంచనాలు పేర్కొనగా అనూహ్యంగా అక్కడ బిజెపి ఘన విజయం సాధించి తిరిగి అధికార పగ్గాలు చేపట్టబోతోంది.2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ పండితులు విశ్లేషించిన నేపథ్యంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలు సర్వశక్తులు ఒడ్డి పోటాపోటీగా ప్రచారం సాగించాయి. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మీద ఆధారపడగా, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం సాగించారు.

రాజస్థాన్‌లో ఆనవాయితీ కొనసాగింది
ఒకసారి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోకుండా ఉండే రాజస్థాన్ ఓటర్ల ఆనవాయితీ మళ్లీ కొనసాగింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ అశలకు గండికొడుతూ బిజెపి ఘన విజయం సాధించింది. 200 అసెంబ్లీ స్థానాలకుగాను ఒక అభ్యర్థి మృతి కారణంగా 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బిజెపి 115 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. భారత్ ఆదివాసీపార్టీకి 3,బిఎస్‌పికి 2, రాష్ట్రీయ లోక్‌దళ్ , రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి తలా ఒక స్థానం దక్కాయి. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి ముఖాన్ని పరిచయం చేయకుండనే బరిలోకి దిగిన కమలం మరోసారి వికసించింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటతో అయిదేళ్లు గడిపిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌లు చివర్లో కలిసే ఉన్నట్లు నటించే ప్రయత్నం చేసినా ఓటర్లు మాత్రంకాషాయానికే అధికకారం కట్టబెట్టారు. గెహ్లోట్, సచిన్‌పైలట్‌లు విజయం సాధించినప్పటికీ పార్టీని మాత్రం విజయపథంలో నడిపించలేక పోయారు. ఇక ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పగ్గాలను ఎవరికి కట్టబెడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియాకే మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా? లేక గెలిచిన కేంద్రమంత్రుల్లో ఎవరైనా సిఎం అవుతారా? వీరెవరూ కాకుండా కొత్త ముఖాన్ని రాష్ట్రప్రజలకు పరిచయం చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.

మధ్యప్రదేశ్‌లో మళ్లీ కమల వికాసం

మధ్యప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసించింది. రాష్ట్రంలో 230 స్థానాలకుగాను ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కాగా.. బిజెపి 163 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరుగులేని మెజారిటీతో మరోసారి అధికారాన్ని చేట్టడానికి సిద్ధమయింది. 2018లో చేజారిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కలలు కన్న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆశలపై కమలం పార్టీ నీళ్లు చల్లింది. కాంగ్రెస్ పార్టీ కేవంల 66 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇతరులు ఒక చోట విజయం సాధించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఇది అయిదో సారి. పార్టీకి విజయం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత సిఎం శివరాజ్ సింగ్‌కు మరో సారి అవకాశం కల్పిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. వివిధ వర్గాలను ఆకట్టుకునే పథకాలద్వారా ‘మామ’గా శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలో పేరుంది. శివరాజ్ సింగ్ ప్రవేశపెట్టిన పథకాలకు బిజెపి ‘జన ఆశీర్వాద యాత్ర’ ద్వారా విస్తృత ప్రచారం కల్పించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామమందిరం ఉచిత దర్శనం కల్పిస్తామని ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మామీ ఇచ్చింది. ఈ హిందూత్వ అంశం కూడా బిజెపికి బాగా కలిసి వచ్చింది. మరో వైపు ఎస్‌సిలు, మహిళా ఓటర్లు కమలం పార్టీ వైపు మొగ్గు చూపడం కూడా ఆ పార్టీ ఘన విజయానికి తోడయింది.

చత్తీస్‌గఢ్‌లో పని చేసిన మోడీ చరిష్మా
చత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపినప్పటికీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఇప్పటివరకు అదికారంలో ఉన్న భూపేశ్ బాఘెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేపడుతుందని అందరూ అనుకొన్నా ఓటర్లు మాత్రం కమలనాథులకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపి 54 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌పై అవినీతి, నిరుద్యోగం వంటి అస్త్రాలతో బరిలోకి దిగి బిజెపి సఫలీకృతం అయింది. మేనిఫెస్టోలో ప్రకటించినసంక్షేమ పథకాలద్వారా రైతులు, మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగింది.గత పార్లమెంటులో పని చేసిన మోడీ చరిష్మా ఫార్ములానే ఈ సారి కూడా పార్టీ అమలు చేసింది. మోడీ ప్రచారంతో హోరెత్తించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణం ప్రధాన ప్రచార అస్త్రం అయింది. ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తూ బిజెపి విడుదల చేసిన 104 పేజీల చార్జిషీట్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. దీనికి తోడు ప్రచారం మధ్యలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కూడా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఈ బెట్టింగ్ యాప్‌ను రూపొందించడానికి ముఖ్యమంత్రి బఘేల్ స్వయంగా తనను ప్రోత్సహించారని ప్రధాన నిందితుడు శుభమ్ సోని ఆరోపించడం కూడా కాంగ్రెస్ విజయావకాశాలను బాగా దెబ్బతీసింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు మళ్లీ అవకాశం కల్పిస్తారా లేక కొత్త వారిని గద్దెనెక్కిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News