Sunday, January 19, 2025

ఎవరికి నష్టం, ఎవరికి లాభం?

- Advertisement -
- Advertisement -

మొత్తానికి త్వరలో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకుగాను బిజెపి తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఇప్పటికే బిజెపి ప్రధాన పక్ష్యంగా ఉన్న ఎన్‌డిఎ కూటమిలోని జనసేన పార్టీతో టిడిపి జత కూడి ఉన్నది. సీట్ల పంపకం స్థూలంగా జరిగినప్పటికీ బిజెపి, జనసేనలు ఏఏ స్థానాల నుండి పోటీ చేయాలనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.ఈ పొత్తులో ఎవరి ప్రయోజనాలు ఎంత , ఎవరి భవిష్యత్తు ఎంత అనేది లోతుగా పరిశీలించాల్సిన అంశాలు. ముందుగా ఐదేళ్ల క్రితం ఇదే ప్రధాని మోడీ దేశీయాంగశాఖ మంత్రి అమిత్ షాలు ఇదే చంద్రబాబు చేతిలో ఘోర అవమానాలు, వ్యక్తిత్వ హననాలకు గురయ్యారు.

నేడు బిజెపి నాయకులు, మోడీ, అమిత్ షాలు అవన్నీ మరిచి ఏం ఆశించి ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు కుదురుచుకున్నారు? వ్యక్తిగతం కంటే పార్టీ హితమే మిన్నగా భావించి లోక్‌సభలో 400 పైగా స్థానాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకునే రంధితో చంద్రబాబుతో చేతులు కలిపినట్లు అర్ధమవుతున్నది. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపిని ఓడించి బాబును అధికారంలో కూర్చోబెట్టడానికి కాదనేది అంతర్గత అర్థంగా కూడా స్పష్టమవుతున్నది. మరి ఆ చరిత్ర కోసం వైఎస్‌ఆర్‌సిపితోనే పొత్తు కుదుర్చుకోవచ్చుగా అనే సందేహామూ వస్తుంది. కానీ జగన్ పొత్తులకు వ్యతిరేకి. పైగా బిజెపితో కలిస్తే ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు దూరం అవుతాయనే భయం కూడా జగన్‌కు ఉండి ఉంటుంది. బిజెపితో పొత్తులో బాబు సుప్రయోజనం కూడా ఇమిడి ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రంలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే కమలదళం నీడలో కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందవచ్చునని ఊరడిల్లవచ్చుననేది చంద్రబాబు నమ్మకం.

వ్యక్తిగతంగా చంద్రబాబుకు కలిగే ప్రయోజనాన్ని పక్కనపెడితే ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒరిగేదేమిటి. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆగడాలకు అవకాశం లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయనే ఒక భరోసా తప్ప గొప్పగా ఏదో జరుగుతుందని కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి చాలా నామమాత్రంగా ఉన్న పార్టీ. తమకు విద్యావంతులు నగరఓటర్లలో ఆదరణ ఉంటుందని బిజెపి వారు అనుకున్నా ఆ రాష్ట్రంలో ఈ నమ్మకం పనిచేయదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిర్వాకం నిర్లిప్తతలు ఆ రాష్ట్ర ప్రజల మదిలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ అంశాల గురించి ఆలోచించేవారు ఎక్కువగా వారు అనుకునే విద్యావంతులు, నగర ఓటర్లే.

దేశాన్ని ప్రధాని మోడీ ఎంతో సమర్థంగా పరిపాలిస్తున్నారని ఆంధ్ర బిజెపి నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ బయట పల్లకీల మోత సరే ఇంట్లో ఈగల మోత గురించి పట్టించుకోరు ఏంటని ఎందుకని ఆ నగర ఓటర్లు విద్యావంతులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇకపోతే ఆంధ్ర బిజెపిలోని నాయకులంతా తెలుగుదేశం గోత్రీకులే. తెలుగు దేశానికి వెన్నుదన్నుగా ఉండే కమ్మ సామాజిక వర్గంకు చెందినవారే. ఈ పొత్తు కుదిరినా కుదరకపోయినా వారు వారి బంధుజన సందోహం తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండేవారే. కొద్దోగొప్పో కాపు సామాజిక వర్గం వారున్నా వారూ కుల బలాలతో నడిచే ఆంధ్ర రాజకీయాల్లో తమ సహజ ప్రత్యర్థులైన కమ్మ సామాజిక వర్గం వారికి వ్యతిరేకంగా పనిచేసే వారే.

అంటే వారి ఓట్లు అటు కాంగ్రెస్‌కో, వైసిపికో బదిలీ అవుతాయి తప్ప తెలుగుదేశంకు బదిలీ కావు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న కొద్ది బిజెపి ఓట్లలో ప్రధాన భాగం పొత్తును అనుసరించి బదిలీకాక చెదిరిపోతాయి. ఇతర సామాజిక వర్గాల్లో అనగా బ్రాహ్మణ, వైశ్య లాంటి వర్గాల్లోనూ ఉత్తర భారతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిలోనూ ఉండె ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పరివారం ఓట్లే నికరంగా పొత్తుననుసరిస్తాయి. కానీ వీరి శాతం తక్కువ. కనుక మొత్తంగా చూస్తే ఈ పొత్తు వల్ల తెలుగుదేశంకి రాజకీయంగా ఒరిగేదేమీ లేకపోయినా వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఆయన కుటుంబానికి లబ్ధిచేకూరుతుంది అనేది స్పష్టం అవుతున్నది.

తమతో పొత్తుకు బిజెపి సుముఖత చూపినా వైసిపి నిరాకరించినట్లు తెలుస్తున్నది. ఇప్పటిలా ఎప్పటికీ స్నేహం గా ఉందాం. కానీ పొత్తుగిత్తు జాంతానై అని కుండ బద్దలు కొట్టింది. బిజెపితో పొత్తు ఉంటే ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు పడవని వైసిపికి స్పష్టంగా తెలుసు. తనకు విశ్వసనీయ ఓటు బ్యాంక్‌గా ఉన్న ఆ వర్గాల కోసం పొత్తుకు వైసిపి నో చెప్పింది. ఇలా వైసిపి నో చెప్పాకే 400 సీట్లు దాటాలనే లక్ష్యంతోనున్న బిజెపి టిడిపితో పొత్తుకు సిద్ధమైంది. మైనారిటీ వర్గాల ఓట్లు దూరమైనా ఫరవాలేదు, రాజకీయంగా నష్టపోయినా ఇబ్బందిలేదు, వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి ఎంతో ముఖ్యమని చంద్రబాబు భావించి బిజెపితో పొత్తుకు క్షణం ఆలస్యం చేయకుండా ఓకే అన్నాడు. అయినా బిజెపివారు నాన్చినాన్చి చంద్రబాబు వేచి చూసేలా చేశారు. అయినా చంద్రబాబు సహించి భరించి వారి పిలుపు కోసం ఎదురు చూసి చూసి బిజెపిని ప్రసన్నం చేసుకున్నాడు. దీంతో మైనారిటీ వర్గాల ఓట్లను టిడిపి కోల్పోయినట్లే. ఇది కూటమికి పెద్ద దెబ్బే. అయితే ఆ మేర హిందువుల ఓట్లు తమవైపు మల్లుతాయని వారు భావించి ఉండవచ్చు. కానీ హిందూ మతం పేరుతో ఓట్లు ఒక కూటమికి మల్లే అవకాశం రాష్ట్రంలో ఉందా. వామపక్ష కుల, ఫ్యాక్షన్ ముఠాల ప్రభావంలో రాజకీయాలు నడిచే ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మతం పేరుతో ఓట్లు మల్లుతాయనుకోవటం భ్రమే.

ఈ పొత్తు వల్ల బిజెపి ఆ రాష్ట్రంలో రాజకీయంగా చాలా నష్టపోతున్నది. లోక్‌సభలో 400కు పైగా సీట్లు సాధించాలన్న తక్షణ ప్రయోజనం యావలో దీర్ఘకాలంలో ఆ రాష్ట్రంలో బలపడే అవకాశాలను చేజేతులారా సమాధి చేసుకున్నది. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు బిజెపి వేచి చూసినట్లయితే బాగుండేది. ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం ఓడిపోతే అది చాలా బలహీనపడేది. రాజకీయ శూన్యత ఏర్పడేది. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగితే బిజెపి కచ్చితంగా బలపడేది. జనసేన బిజెపిలో విలీనం అయ్యే అవకాశమూ ఉండేది. కానీ ఒకవేళ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే బిజెపి పరిస్థితి మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. నేడు పోటీ చేసిన స్థానాల్లో కొన్నిటిని బిజెపి గెలుచుకున్నా ఒకరిద్దరు కేంద్రంలో మంత్రులు అవుతారు. రాష్ట్రంలో కూటమి గెలిచినా రాష్ట్రంలో ఒకరిద్దరు బిజెపి మంత్రులు కావచ్చు. అలాగే కేంద్రంలో టిడిపి ఎంపిలు కూడా ఒకరిద్దరు మంత్రులు అయ్యే అవకాశం ఉంది. కాగా ఈ మొత్తం ఎన్నికల పొత్తులు సీట్ల సర్దుబాట్లలో పిచ్చి పువ్వు అయినది పవన్ కళ్యాణ్. ఎన్నికల అనంతరం జనసేన బిజెపిలో విలీనం కావటమో, ఆంధ్ర రాజకీయ యవనిక నుండి అదృశ్యం కావడమో ఖాయంగా కనిపిస్తున్నది.

కెఎస్‌ఎన్ ప్రసాద్: 9492522089

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News