Sunday, January 19, 2025

వంద మందితో బిజెపి తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జాబితా వచ్చే వారం విడుదల చేయనుంది. ఈ తొలి వంద మంది పేర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉంటుంది. షెడ్యూల్, మార్చి మొదటి వారంలో జరిగే కేంద్ర మంత్రి మండలి కీలక భేటీకి కొద్దిగా ముందు అటూ ఇటూగా ఈ శత జాబితా వెలుగులోకి రానుందని పార్టీ వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే గురువారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే రూపొందించిన జాబితాపై మరో మారు సమీక్షించుకుని ఈ వంద మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించేందుకు అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ, అమిత్ షా తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. ఇప్పటి రాజకీయ పరిణామాలను , వ్యూహప్రతివ్యూహాలను కూడా బేరీజు వేసుకుని సాగుతున్నారు. తొలి జాబితాలో మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ , స్మృతి ఇరానీ వంటి పేరుమోసిన వారి పేర్లే ఉంటాయని భావిస్తున్నారు. ప్రముఖుల పేర్లు తప్పించడం అత్యద్భుత పరిస్థితుల్లో కానీ జరగదని వెల్లడైంది.

ఈ నెల 29వ తేదీన పార్టీ సిఇసి సమావేశం జరుగుతుంది. ఈసారి ఎన్నికలలో బిజెపి సొంతంగా 370 , ఎన్‌డిఎ కూటమి మిత్రపక్షాలతో కలిపితే 400 స్థానాలు దక్కించుకోవాలనేదే మోడీ షా ద్వయం లక్షంగా ఉంది. ఇందుకు అనుగుణంగానే తొలి జాబితాను సాధ్యమైనంత త్వరగా వెల్లడించి, పార్టీ శ్రేణులలో ఆత్మస్థయిర్యం కల్పించాల్సి ఉంటుందని మోడీ ఆలోచిస్తున్నారు.ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కోరుకున్న సీట్లబలం సాధించుకోవడానికి యుపి , మరో నాలుగు ప్రధాన రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉందని పార్టీ నేతలు కార్యరంగంలోకి దిగారు. శనివారం ఉత్తరప్రదేశ్‌పై ఎన్నికల వ్యూహం ఖరారు గురించి జరిగిన సమావేశంలో అమిత్ షా, సిఎం ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాథక్ ఇతరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాలలో బిజెపి గత లోక్‌సభ ఎన్నికలలో 62 సీట్లు తెచ్చుకుంది. బలం చాటుకుంది. యుపి తరువాత తెలంగాణ, రాజస్థాన్ చత్తీస్‌గఢ్‌లపై పార్టీ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన బిజెపి నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.

లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలలో దాదాపు 400 సీట్లలో విజయం పెద్ద రికార్డు అవుతుంది. అయితే పరిస్థితులు ఇందుకు అనుగుణంగానే ఉన్నాయని బిజెపి వర్గాలు ధీమాతో ఉన్నాయి. మోడీ ఇప్పుడు వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎంపిగా ఉన్నారు. వారణాసి మోడీకి తిరుగులేని విజయం తెచ్చిపెట్టింది. పూర్తి సెంటిమెంట్ కోణంలోనే దీనిని ఆయన ఎంచుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి తన స్థానం నుంచి దాదాపుగా నాలుగున్నర లక్షల మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ యుపిలోని ఈ ప్రధాన నియోజకవర్గంపై తన పట్టు సడలడకుండా ఆయన తరచూ ఇక్కడికి వెళ్లివస్తూ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News