న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం అధికార బిజెపి పెట్టుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం సిట్టింగ్ అభ్యర్థి శశి థరూర్ గురువారం ఎద్దేవా చేశారు. బిజెపి చెప్పుకుంటున్న 400(సీట్లు)కి పైనే ఒక జోక్. 300కిపైనే అసాధ్యం..200కి పైనే ఒక సవాలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి ముందుగానే నిర్ణయమైపోయిందని ఆయన చెప్పారు. పిటిఐ వార్తాసంస్థ ప్రధాన కార్యాలయంలో ఎడిటర్లతో ఆయన మాట్లాడుతూ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కదని జోస్యం చెప్పారు. దక్షిణాదిలో బిజెపి విజయావకాశాలు 2019 కన్నా తక్కువగా ఉంటాయని ఆయన అంచనా వేశారు.
ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన తిరువనంతపురంలో బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్, సిపిఐ పి రవీంద్రన్ నుంచి ముక్కోణపు పోటీని ఎదుర్కొంటున్న శశి థరూర్ తాను మంచి మెజారిటీతో గెలవనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ నియోజవకర్గం నుంచి వరుసగా నాలుగవసారి గెలిచిన రికార్డును ఆయన సొంతం చేసుకుంటారు. తిరువనంతపురంలో రెండు నెలలపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఢిల్లీకి తిరిగి వచ్చిన శశి థరూర్ ఇక తన దృష్టిని ఇతర రాష్ట్రాలలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంపై సారించనున్నారు. రెండు దశల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్, ఇండియా కూటమి విజయావకాశాలు ఎలా కనిపిస్తున్నాయన్న ప్రశ్నకు ఇప్పటి వరకు 190 సీట్లకు ఎన్నిక జరిగిందని, తనకు అందుతున్న సమాచారం మేరకు తమకే అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు.
తమకు అనుకూలంగా ప్రభంజనం వీస్తోందని తాను అనడం లేదని, కాని కేంద్రంలోని ప్రభుత్వానికి అనుకూలంగా కూడా పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2014, 2019 ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు మధ్య తేడా ఏమిటంటే ఆ ఎన్నికల్లో బిజెపి ఓటర్లలో ఉన్న భావోద్వేగం ఇప్పుడు కనిపించడం లేదని చాలామంది ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారని థరూర్ చెప్పారు. ఇప్పటి వరకు ఓటింగ్ పూర్తయిన హిందీ మాట్లాడే రాష్ట్రాలలో పరిస్థితి ఆశాజనకంగా ఉందని కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా అధికంగానే ముందంజలో ఉన్నామని తాను చెప్పగలనని ఆయన అన్నారు. ఇంకా ఐదు దశల ఎన్నికలు జరగవలసి ఉందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారన్న ప్రశ్నకు ఒక క్రికెట్ అభిమానిగా తాను స్కోరు గురించి జోస్యం చెప్పనని, విజాయలను మ్రామే జోస్యం చెబుతానని ఆయన చమత్కరించారు.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను బట్టి చూస్తే ఎన్‌డి ప్రభుత్వం మైజారిటీని కోల్పోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని, బిజెపి మెజారిటీని కోల్పోతోందని ముందుగానే అందరూ నిర్ణయానికి వచ్చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్రాలలో బిజెపి అన్ని సీట్లను గెలుచుకుందని, మూడు రాష్ట్రాలలో ఒక సీటు తప్ప అన్నీ గెలుచుకుందని, రెండు రాష్ట్రాలలో రెండు సీట్లు తప్ప అన్నిటినీ గెలుచుకుందని, అయితే ఇది ఈ సారి సాధ్యం కాదని ఆయన అంచనా వేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదని, అయితే ఈసారి ఐదు నుంచి ఏడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. కర్నాటకలో గత ఎన్నికల్లో ఒక సీటును మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుందని, కాని ఈ సారి 10 నుంచి 17 స్థానాలు, కొందరైతే 20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారనని ఆయన తెలిపారు.
గత ఎన్నికల్లో మంచి విజయాలు దక్కించుకున్న రాష్ట్రాలలో సైతం బిజెపి ఈ సారి చాలా సీట్లను కోల్పోయే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 200 సీట్లు దాటడం బిజెపికి సవాలుగా మారనున్నదని ఆయన చెప్పారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న బిజెపి ఈసారి వాటిని కాపాడుకేనేందుకు పోరాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటకలో కూడా ఆ పార్టీకి గత ఎన్నికల నాటి పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు లేవని ఆయన చెప్పారు.
గతీ ఎన్నికలలో కర్నాటకలో 28 సీట్లు, తెలంగాణలో 4 సీట్లను బిజెపి గెలుచుకుంది. 2014లో ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం చేయడంతో బిజెపికి యువజనులు ఓటు వేశారని, పదేళ్ల తర్వాత ఉద్యోగాలు దక్కని యువజనులు బిజెపి ఇప్పుడు ఎందుకు ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. గత పదేళ్లలో 80 శాతం మంది భారతదేశ ప్రజల ఆదాయం పడిపోయిందని ఆర్థికవేత్తలు చెబుతుండగా తమను ఈ దుస్థితికి దిగజార్చిన బిజెపికి ఈ 80 శాతం మంది ప్రజలు ఓటు వేస్తారా అని థరూర్ ప్రశ్నించారు.