కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం
ముంబై: వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనిపై విశదీకరించవలసిందిగా విలేకరులు కోరగా.. ప్రభుత్వాలను కూల్చడం, ఏర్పాటు చేయడం రహస్యంగా జరుగుతాయని, వీటిని బహిరంగంగా చర్చించడం కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మాట్లాడారని, ఇది నిజం కాగలదని తాను ఆశిస్తున్నానని రాణే అన్నారు.
మహారాష్ట్రకు చెందిన బిజెపి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో మకాం వేసిన తరుణంలో నారాయణ్ రాణే చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త ఊహలకు తెరతీశాయి. కాగా.. శనివారానికి(నవంబర్ 27) మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కానుండడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుశ్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా..రాణే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే స్పందిస్తూ బిజెపి చెప్పే జోస్యాలు ఫలించబోవని, ఎంవిఎ ప్రభుత్వం మహారాష్ట్రలో పూర్తి కాలం అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు.