హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్న చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నాయకులు పరిశీలించారు. శనివారం చేవెళ్లలో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం చేవెళ్లలో జరిగే సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మధ్యప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. శంషాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం అమిత్ షాని కలవనున్నారని వారు వెల్లడించారు.