మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు, ఓటింగ్ శాతం భారీగా పెరిగాయని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము తెలంగాణలోని అన్ని స్థానాలను గెలవడంతో పాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు.
మోడీ భారత ప్రజానీకానికి భద్రత, భరోసా ఇవ్వడమే కాకుండా భారత చిత్ర పటాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. 2014 వరకు ఎంత అభివృద్ది జరిగిందో 2014 నుండి 2023 వరకు అంతకన్నా ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి దేశమంతటా స్విీప్ చేస్తుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు ప్రసంగిస్తూ ఎంఐఎంతో స్నేహం చేసే పార్టీలకు తాము మద్దతు ఇవ్వమన్నారు. కడియం శ్రీహరి మాటలకు బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రపోషిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి టిడిపి మిత్రుడు కావడంతో కడియం కాంగ్రెస్‌లో చేరి మంత్రిగా అయ్యే అవకాశం ఉందన్నారు.