అమ్మిన మొత్తం బాండ్లలో 54 శాతం బిజెపి ఖాతాలోకే
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు గురువారంచలన తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఈ పథకం వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన భారతీయ జనతా పార్టీకి సుప్రీంకోర్టు తాజీ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 2023 వరకు మొత్తం రూ. 13,008 కోట్ల ఎన్నికల బాండ్లను 25 విడతలుగా విక్రయించారు.
సమాచార హక్కు కార్యకర్త లోకేష్ బాత్ర సేకరించిన వివరాలు ప్రకారం..2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య మరో ఐదు విడతలుగా రూ. 4509 కోట్ల విలువైన ఎన్నికల బాండ్ల విక్రయాలు జరిగాయి. అయితే ఏ పార్టీ ఎంత మొత్తంలో బాండ్లు అందుకున్నదీ అన్న వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. 2017 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ కాలంలో బిజెపి రూ. 6570 కోట్ల బాండ్లను అందుకుంది. ఆ కాలంలో విక్రయించిన మొత్తం బాండ్లలో 54 శాతం ఒక్క బిజెపికే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 9 శాతం అంటే రూ. 1123 కోట్లు అందగా. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 1092 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో సమకూరాయి.
ఎన్నికల బాండ్ల రూపంలో 2023 మార్చి వరకు బిజెపికి రూ. 6570 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 1123 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 1092 కోట్లు, డిఎంకెకు 616 కోట్లు, బిఆర్‌ఎస్‌కు రూ. 912 కోట్లు, వైఎస్‌ఆర్‌సిపికి రూ. 381 కోట్లు, టిడిపికి రూ. 146 కోట్లు, ఆప్‌కు 84 కోట్లు, బిజెడికి రూ. 774 కోట్లు విరాళాలు అందాయి. కాగా..ఎన్నికల బాండ్లను స్వీకరించని ఏకైక పార్టీగా సిపిఎం నిలుస్తుంది.