Monday, December 23, 2024

ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన బిజెపి : రాహుల్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఎమ్‌ఎల్‌ఎలను బీజేపీ కొనుగోలు చేసిందని, అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, నవంబర్ 17 న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లలో 150 సీట్లను కాంగ్రెస్ గెల్చుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానికి 55 కిమీ దూరంలో ఉన్న విదిశ లో మంగళవారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.

“ ఐదేళ్ల క్రితం మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ బీజేపీ నేతలు ( ప్రధాని ) మోడీ, (ముఖ్యమంత్రి) శివరాజ్ సింగ్ చౌహాన్, (కేంద్ర మంత్రి) అమిత్‌షా తదితర నేతలు ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసి మీ ప్రభుత్వాన్ని విక్రయించారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దాంతో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2020 మార్చి వరకు కేవలం 15 నెలలే మధ్యప్రదేశ్‌లో పాలన సాగించి 27 లక్షల మంది రైతుల రుణమాఫీ చేయగలిగిందని వివరించారు. అయితే అప్పటి ప్రభుత్వాన్ని కూల్చివేయడం ద్వారా కార్మికులను, రైతులను, చిన్న వ్యాపారులను , నిరుద్యోగులను బీజేపీ మోసగించిందని ధ్వజమెత్తారు.

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం లోంచి బీజేపీని కాంగ్రెస్ ప్రేమద్వారా తొలగించింది తప్ప, ద్వేషంతో కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎల్‌పిసి సిలిండర్లను ఒక్కోటి రూ. 500 కే ప్రజలు పొందగలుగుతుండగా, మిగతా రాష్ట్రాల్లో అవే సిలిండర్లకు రూ. 1200 నుంచి రూ. 1400 వరకు చెల్లించవలసి వస్తోందని తెలియజేశారు. కర్ణాటకలో రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చగలిగిందన్నారు.

ఛత్తీస్‌గఢ్ లోని రైతు పంటలకు కనీస మద్దతు ధరలను పొందగలుగుతున్నారని, కార్మికులు రూ. 10 వేల వరకు వేతనాలు పొందగలుగుతున్నారని ఉదహరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ హామీల గురించి ప్రస్తావిస్తూ గోధుమకు కనీస మద్దతు ధర క్వింటాలు రూ. 2600 నుంచి రూ. 3000 కు పెంచడమవుతుందని, పొరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లో రైతులు తమ భూమిని అమ్ముకోడానికి ఇష్టపడడం లేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News