ముంబయి: మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉన్నపుడు తమ పార్టీని ఖతం చేసేందుకు ప్రయత్నించిందని, తమను బానిసలుగా చూసిందని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ ఆరోపించారు. 2014-19 కాలంలో బిజెపిశివసేన కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తమ మద్దతుతో అధికారం చేపట్టిన బిజెపి తమను రెండోస్థానంలో చూసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రౌత్ విమర్శించారు. ఇటీవలే ప్రధాని మోడీతో శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశమైన కొన్ని రోజులకే అదే పార్టీ ఎంపి నుంచి తీవ్ర వ్యాఖ్యలు రావడం గమనార్హం.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపితో విభేదించిన శివసేన కాంగ్రెస్, ఎన్‌సిపితో కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ ఇప్పుడు తమ ప్రభుత్వానికి బలమైన అధికార ప్రతినిధి అని, ఉద్ధవ్‌తో భుజంభుజం కలిపి పని చేస్తున్నారని రౌత్ అన్నారు. శివ సైనికులకు ఎలాంటి లబ్ధి చేకూరకున్నా, ప్రభుత్వం శివసేన చేతుల్లో ఉండటం తమకు గర్హించదగిన విషయమని రౌత్ అన్నారు.