Wednesday, January 22, 2025

కులాల కుంపట్లలో ఎవరిది పైచేయి?

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కమలనాథులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ కూడా అంతే దీటుగా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా కులాలను ట్రంప్‌కార్డుగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఇదే ఇప్పుడు ఆ పార్టీలకు సవాలుగా మారుతుండడం గమనార్హం. 2018 ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీచిన ప్రాంతాలపై బిజెపి ఈ సారి ప్రధానంగా దృష్టిపెడుతోంది. ఈ క్రమంలో కులహింసకు కేంద్ర బిందువుగా మారిన గ్వాలియర్‌చంబల్ ప్రాంతంలోని మోరేనా జిల్లాపై దృష్టి కేంద్రీకరించింది.ఈ జిల్లాలో ఉండేది ఆరు అసెంబ్లీ స్థానాలే కానీ వాటి ప్రభావం 34 నియోజకవర్గాలపై ఉంటుంది. ఈ క్రమంలోఆయా స్థానాల్లో పట్టు సాధించడానికి ప్రధాన పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి.

అయితే దళిత పార్టీగా చెప్పుకునే బిఎస్‌పి ఈ రెండు పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో ఈ మూడు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో ఎస్‌సి, ఎస్‌టి ఓటర్లు ఎక్కువ. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్త ఓటర్లలో దాదాపు 16 శాతం వీరే. బ్రాహ్మణులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బిజెపికి ఓటు వేస్తారు. 2018 ఎన్నికలకు ముందు మొరేనా జిల్లాలో కులాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి దీనికి భారీగానే మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఈ ప్రాంతంలోని మొత్తం 34 నియోజకవర్గాలకు గాను 26 స్థానాలను కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌టిలకు కేటాయించిన 35 స్థానాల్లో 17 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది.

అందులో మొరేనా జిల్లాలోని అంబా నియోజకవర్గం కూడా ఉంది. కానీ ఫలితాలు వెల్లడయిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ తన మద్దతుదారులతో కలిసి బిజెపిలో చేరిపోయారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ సారి దళితులు, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు పథకాలను తీసుకువచ్చింది. బుందేల్ ఖండ్ రీజియన్‌లో రవిదాస్ మెమోరియల్ నిర్మాణానికి 100 కోట్లు కేటాయించింది. దళిత సామాజిక వర్గాల్లో రవిదాసియా వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఆకట్టుకునేందుకే బిజెపి ఈ ఎత్తుగడ వేసింది.

బ్రాహ్మణుల్లో అసంతృప్తి
అయితే చిరకాలంగా బిజెపికి అనుకూలంగా ఉండే బ్రాహ్మణుల్లో ఈ సారి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నా తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎంఎల్‌ఎ కూడా లేరని వారిలో ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. దీనికి తోడు దళితులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేయడం వారికి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంటోంది. బ్రాహ్మణులతో పాటుగా గుజ్జర్ సామాజిక వర్గంలో కూడా బిజెపి పట్ల అసహనం వ్యక్తమవుతోంది.ఈ ప్రాంతంలో నామినేషన్ పదవులు,పార్టీలో కీలక స్థానాలను ఠాకూర్ వర్గీయులకే ఇస్తున్నారన్న వాదన ఉంది. జాతీయ స్థాయిలో ఈ రెండు వర్గాలు బిజెపికి అనుకూలంగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్యను కమలం పార్టీ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.

కాంగ్రెస్‌కూ కష్టమే
మరో వైపు ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సారి పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు.బిఎస్‌పి, ఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా గట్టిగా పోరాడుతుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది.వీటన్నిటికీ తోడు రెబెల్స్ బెడద ఉంది. క్షేత్ర ్సయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల మొరేనా జిల్లాలోని సుమవలి నియోజక వర్గం అభ్యర్థిని ఆ పార్టీ మార్చాల్సి వచ్చింది.ఈత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో వైపు బిజెపి ఎత్తుగడలను గమనించిన ఆ పార్టీ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తురుపు ముక్కగా వాడుకుంటోంది. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత వర్గానికే చెందిన వారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు మేలు జరుగుతుందనే భావనను ఆ పార్టీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చైహాన్‌కు వ్యతిరేకంగాఖర్గే ఏడాది ప్రారంభంలో జన్ ఆక్రోశ్ యాత్రను ప్రారంభించారు.

చౌహాన్‌పై సందేహం
మరో వైపు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది.బిజెపి జాతీయ నాయకుల్ని అసెంబ్లీ బరిలోకి దించడంతో తదుపరి ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారో లేదోనన్న సందేహం బలపడుతోంది. ఈ క్రమంలో ఈ ప్రాంతంపై ఎవరు పట్టు సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News