న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ పార్టీలు వోటర్లను ఆకర్షించేందుకు హామీలను గుప్పిస్తున్నాయి. ఇప్పటికు మేనిఫెస్టోను ప్రకటించిన బిజెపి తాజాగా మంగళవారం మరొక మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య సౌకర్యం కల్పిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. పాలిటెక్నిక్‌ర ఐటిఐలలో టెక్నికల్ కోర్సులు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) విద్యార్థులకు భీమ్ రావ్ అంబేద్కర్ స్టైపెండ్ పథకం కింద ప్రతి నెల రూ. 1000 వంతున ఉపకార వేతనాలు అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
యుపిఎస్‌సి, రాష్ట్ర సివిల్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ ప్రకటించింది. ఒక ఆటో ట్యాక్సీ డ్రైవర్ సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన బిజెపి డ్రైవర్లకు రూ. 10 లక్షల జీవిత బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. అదే విధంగా ఇళ్లలో పని చేసే కార్మికుల కోసం సంక్షేమ మండలి ఏర్పాటుకు, అవే బీమా సౌకర్యాల కల్పనకు పార్టీ వాగ్దానం చేసింది. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు బిజెపి సంకల్ప్ పత్ర పార్ట్ 2ను విడుదల చేశారు. ఆప్ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తామని అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.
ఢిల్లీలో జల్ జీవన్ మిషన్ అమలులో విఫలమైనందుకు ఆప్ ప్రభుత్వాన్ని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. సంకల్ప్ పత్ర పార్ట్ 1ను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇటీవలే విడుదల చేశారు. గర్భిణీ స్త్రీలకు రూ. 21 వేల ఆర్థిక సాయం, మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్‌పిజి సిలిండర్లను రూ. 500 ధరకే అందజేయడం వంటివి బిజెపి తొలి మేనిఫెస్టోలో ఉన్నాయి. మరొక వైపు బిజెపి మేనిఫెస్టోపై ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, బిజెపి అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య లభిస్తుందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికీ ఉచిత విద్య అభిస్తోందని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కేజ్రీవాల్ కోరారు.