హర్యానాలో గెలుపుపై మోడీ హర్షం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రశంసనీయ పనితీరును ఆయన అభినందించారు. జమ్మూ కశ్మీరులో ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, ఆర్టికల్ 370, 35(ఎ) రద్దు తర్వాత మొదటిసారి ఈ ఎన్నికలు జరిగాయని ఎక్స్‌లో వరుసగా చేసిన ట్వీట్లలో ప్రధాని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని ప్దర్శిస్తూ ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఇందుకు అక్కడి ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలియచేశారు. హర్యానా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ వరుసగా మూడవసారి బిజెపికి విజయాన్ని అందచేసినందుకు వారికి రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. హర్యానాలో గెలుపును అఖండ విజయంగా ఆయన అభివర్ణిస్తూ ప్రజలకు సేవచేసి తమ అభివృద్ధి అజెండాను వారికి చేరువ చేసిన పార్టీ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కారణంగానే బిజెపి ఈ చారిత్రక విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీరులో కూడా బిజెపి మంచి పనితీరును కనబరిచినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియచేస్తూ తమ పట్ల వారు చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, జమ్మూ కశ్మీరు సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హర్యానాలో 48 స్థానాలలో బిజెపి గెలుపొందగా జమ్మూ కశ్మీరులో 29 స్థానాలలో విజయం సాధించింది. రెండు అసెంబ్లీల సంఖ్యాబలం 90 స్థానాలు.