Monday, February 10, 2025

ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి వోట్ల వాటా 13 శాతం పెరుగుదల

- Advertisement -
- Advertisement -

ఆప్ వాటాలో 10 శాతం క్షీణత
న్యూఢిల్లీ : ఢిల్లీలో గడచిన పది సంవత్సరాల్లో బిజెపి వోట్ల వాటా సుమారు 13 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరగగా, ఆప్ వోట్ల వాటా అదే కాలంలో సుమారు పది పర్సంటేజ్ పాయింట్ల మేర క్షీణించింది. ఢిల్లీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఆప్ వోట్ల వాటాల మధ్య రెండు శాతం తేడా మాత్రమే ఉంది. కాషాయ పార్టీ 70 సీట్లలోకి 48 సీట్లను కైవసం చేసుకుని దేశ రాజధానిలో అధికారానికి రాగా, ఆప్ 22 సీట్లకు పరిమితం అయింది. బిజెపి 26 ఏళ్లకు పైగా దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్నది. కానీ ఉద్ధృత స్థాయిలో సాగించిన ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ ఆప్‌ను ఊడ్చిపెట్టేయడమే కాకుండా ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ సహా పార్టీ దిగ్గజాలను ఓడించింది.

కాగా, కాంగ్రెస్ ఢిల్లీలో వరుసగా మూడవ సారి రిక్త హస్తాలతో వెనుదిరగవలసి వచ్చింది. ఆప్ వోట్ల వాటా 2020 ఎన్నికల్లోని 53.57 శాతం నుంచి 43.57 శాతానికి పడిపోయింది. ఆ పార్టీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం వోట్లు పొందింది. 40 శాతం వోట్ల వాటా పొందిన తరువాత కూడా ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. 2020, 2015 ఎన్నికల్లో ఆప్ వరుసగా 67, 62 సీట్లు పొందడం ద్వారా అఖండ విజయం సాధించింది. బిజెపి 45.56 శాతం వోట్ల వాటా సాధించి 48 సీట్లు గెలుపొందింది.

కాషాయ పార్టీ వోట్ల వాటా 2020 ఎన్నికల్లోని 38.51 శాతం, 2015 ఎన్నికల్లో 32.3 శాతం నుంచి పెరిగింది. 1998 నుంచి 2013 వరకు 15 సంవత్సరాల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ 6.34 శాతం వోట్ల వాటా పొందింది. ఆ వృద్ద పార్టీకి ఏకైక ఉపశమనం ఏమిటంటే పార్టీ వోట్ల వాటా క్రితం సారి కన్నా 2.1 శాతం మెరుగు కావడమే. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 శాతం వోట్లు పొందిన కాంగ్రెస్ ఈ సారి చెల్లుబాటు వోట్లలో 6.34 శాతం నమోదు చేసింది. ఆ పార్టీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం ఆప్‌కు సెగ్మెంట్లలో దెబ్బ కొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News