Sunday, December 22, 2024

ఎలక్టోరల్ బాండ్లలో సింహభాగం బిజెపికే

- Advertisement -
- Advertisement -

అయిదేళ్లలో రూ.5,271.95 కోట్ల విరాళాలుఅందుకున్న కమలం పార్టీ
కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు 10 శాతమే
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకూ భారీగా వచ్చిన విరాళాలు

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచీ ఈ బాండ్ల ద్వారా ఇచ్చిన నిధుల్లో సగానికి పైగా ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 57 శాతం నిధులు అధికార భారతీయ జనతా పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. ఎన్నికల కమిషన్‌కు బిజెపి సమర్పించిన డిక్లరేషన్ ప్రకారం 2017- 2022 మధ్య కాలంలో ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.5,271.97 కోట్లు అందాయి. మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా వెనుక బడి ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆ పార్టీకి కేవలం రూ.952.29 కోట్లు మాత్రమే ఈ పథకం కింద వచ్చాయి.

2022 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు అందజేసిన నివేదికలను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించలేదు. రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేయడానికి ప్రవేశపెట్టిన ఎన్నికలబాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్ల విచారణను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం చేపటిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం సహా కొన్ని రాజకీయ పార్టీలు, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018 జనవరి 2న ప్రవేశపెట్టిన ఈ పథకం కింద భారత దేశ పౌరుడు, లేదా, దేశంలో రిజిస్టర్ అయిన లేదా ఏర్పాటు చేసిన సంస్థ అయినా ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వ్యక్తులయితే ఒంటరిగా, లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. రాజకీయ పార్టీలకు అందజేసే నిధుల విషయంలో మరింత పారదర్శకతను తీసుకు రావడం కోసం నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఈ బాండ్ల పథకాన్నితీసుకు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ)కింద ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానుంచి పొందిన వివరాల ప్రకారం 201718, 2021 22 మధ్య కాలంలో రూ.9,208.23 కోట్ల విలువైన బాండ్లను విక్రయించడం జరిగింది. ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ చేసిన అకౌంట్ స్టేట్‌మెంట్లను విశ్లేషిస్తే ఈ అయిదేళ్ల కాలంలో బాండ్ల ద్వారా బిజెపికి లభించిన విరాళాల విలువ రూ. 5,271.97 కోట్లుగా ఉంది.

మరో వైపు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద మొత్తంలోనే విరాళాలు అందుకున్నాయి. 2011నుంచి పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ అయిదేళ్ల కాలంలో రూ.767.88 కోట్ల విలువైన విరాళాలను బాండ్ల రూపంలో పొందింది. అలా ఆ పార్టీ బిజెపి, కాంగ్రెస్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఒడిశాలో అధికార పార్టీ అయిన బిజూ జనతా దళ్( బిజెడి) ఎన్నికల బాండ్ల ద్వారా 2018 19నుంచి 2021 22 మధ్య కాలంలో రూ.622 కోట్ల విరాళాలను ప్రకటించింది.

2000 సంవత్సరంనుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ పథకం ప్రవేశ పెట్టిన తొలి సంవత్సరం ఎలక్టోరల్ బాడ్ల ద్వారా ఎలాంటి విరాళాలను ప్రకటించలేదు. ఇక తమిళనాడులో 2021నుంచి అధికారంలో ఉన్న డిఎంకె 2019 20నుంచి 2021 22 వరకు అంటే మూడేళ్ల కాలంలో రూ.431.50 కోట్ల విరాళాలను ప్రకటించింది. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆ పార్టీ సమర్పించిన స్టేట్‌మెంట్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలను చూపించలేదు. ఇక ఢిల్లీలో చాలా సంవత్సరాలనుంచిఅధికారంలో ఉన్న , ఇటీవల పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో ‘ ఎలక్టోరల్ బాండ్/ఎలక్టోరల్ ట్రస్ట్’ కేటగిరీ కింద రూ.48.83 కోట్ల విరాళాలు అందుకున్నట్లు ప్రకటించింది.

అయితే ఆ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. ఇక బీహార్‌లో అనేక సంవత్సరాలుగా వివిధ సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న నితీశ్ కుమార్ నేృత్వంలోని జెడి(యు) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.24.40 కోట్లు అందుకున్నట్లు ప్రకటించింది. ఇక అధికారంలో లేని పార్టీల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందిన విరాళాలు రూ.51.5 కోట్లుగా ఉన్నాయి. ఇక సిపిఐ, సిపిఎం, బిఎస్‌పి, మేఘాలయలో అధికార పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీలు తమకు ఎలక్టోరల్‌బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలు అందలేదని ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News