Friday, November 22, 2024

రాజ్యాంగాన్ని మార్చడానికి 400 ఎంపి స్థానాలు ఆశిస్తోన్న బిజేపి : ఉద్ధవ్ థాకరే

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చివేయడానికి లోక్‌సభ ఎన్నికల్లో 400 కు మించి ఎంపిస్థానాలను గెలవాలని బీజేపీ కోరుకుంటోందని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరే గురువారం ధ్వజమెత్తారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా గుహగర్‌లో ర్యాలీని ఉద్దేశిస్తూ థాకరే ప్రసంగించారు. వన్ నేషన్, వన్ ఎలెక్షన్ ప్రతిపాదనపై మాట్లాడుతూ ఇది నియంతృత్వానికి దారి తీసే చర్యగా విమర్శించారు. లోక్‌సభ లోని మొత్తం 543 స్థానాలకు 400 కు మించి స్థానాలను బీజేపీ కోరుకోవడంలో బీజేపీ అసలు ఆంతర్యాన్ని వివరిస్తూ తన ప్లాను ప్రకారం రాజ్యాంగం మారుస్తున్నప్పుడు వ్యతిరేకించే గొంతుకలు ఉండరాదన్నదే వారి లక్షంగా విమర్శించారు. ఇటీవల పార్లమెంట్‌లో వందకు మించి పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ అయ్యారని,

ఆ సమయంలో అనేక ముఖ్యమైన బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయని ఉదహరించారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్, అద్వానీ కాలం నాటి బీజేపీకి ఇప్పటి బీజేపీ దూరమైందని థాకరే విమర్శించారు. 2022 లో శివసేనలో తిరుగుబాటు తలెత్తి చీలికకు దారి తీసిన పరిణామాలను ప్రస్తావిస్తూ తానెప్పుడూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదని, అసాధారణ పరిస్థితుల్లో తాను ఆ పదవిని అంగీకరించవలసి వచ్చిందన్నారు. ‘నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మహారాష్ట్ర సంక్షేమం కోసమే పనిచేశాను, మీ అందరికీ మంత్రి పదవులు కల్పించాను, శాసన సభ్యులుగా చేశాను, కానీ మీరే నన్ను ఈ విధంగా మోసగించారు” అని ఎవరిపేరు చెప్పకుండా థాకరే విమర్శించారు. తన ప్రత్యర్థులు రాజకీయంగా తనను అంతం చేయాలనుకుంటున్నారని, కానీ శివసైనికుల వల్ల గట్టిగా నిలబడ్డానని పేర్కొన్నారు. బీజేపీ “భ్రష్టాచారి అభయ్‌యోజన” ప్రారంభించిందని, అదే మోడీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News