Tuesday, November 5, 2024

బిజెపి ‘వాషింగ్ మెషీన్’

- Advertisement -
- Advertisement -

అవినీతి నిందితులు చేరి నిష్కళంకులు అవుతున్నారు
బిజెపియేతర సిఎంలను లక్ష్యం చేసుకున్న కేంద్రం
శరద్ పవార్ విమర్శల వర్షం

పుణె : ఎన్‌సిపి (ఎస్‌పి) అఢ్యక్షుడు శరద్ పవార్ గురువారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ఒక ‘వాషింగ్ మెషీన్’లా మారిందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ‘నిష్కళంకులు కావడానికి’ ఆ పార్టీలో చేరుతున్నారని శరద్ పవార్ ఆరోపించారు. హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్), అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ)తో సహా బిజెపియేతర రాష్ట్రాల సిఎంలను కేంద్రం లక్షం చేసుకుంటున్నదని ఆయన విమర్శించారు. వివిధ అంశాపై ప్రధాని నరేంద్ర మోడీని కూడా పవార్ విడిచిపెట్టలేదు.

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు చేసినందుకు మోడీని పవార్ తప్పు పట్టారు. పుణె జిల్లా లోనవాలాలో తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్‌చంద్ర పవార్) కార్యకర్తల సమ్మేళనంలో పవార్ ప్రసంగిస్తూ, ‘ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి గురించి మాట్లాడేటప్పుడు అవిభాజ్య ఎన్‌సిపిని విమర్శిస్తుండేవారు. బిజెపి అధికారంలో లేనప్పుడు ఎటువంటి అవకతవకలు జరిగాయో వివరించే కరపత్రాన్ని పార్లమెంట్‌లో ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. ఆ కరపత్రంలో ఆదర్శ్ కుంభకోణం, అశోక్ చవాన్ పాత్ర గురించి ప్రస్తావన ఉన్నది. కాని ఏడవ రోజు చవాన్ బిజెపిలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు అంటే ఒక వైపు మీరు (బిజెపి)ఆరోపణలు చేస్తూ మరొక వైపు ఆ వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకుంటారు’అని చెప్పారు.

అంతకుముందు ప్రధాని మోడీ ఎన్‌సిపిలోని ‘అవినీతిపరుల’ గురించి మాట్లాడారు. ‘మహారాష్ట్రలో రూ. 70 వేల కోట్లు విలువ చేసే నీటిపారదల కుంభకోణం గురించి ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంక్‌లో అవకతవకలపై కూడా ఆయన మాట్లాడారు. ఎన్‌సిపిలోని ఎవ్వరికీ ఎంఎస్‌సి బ్యాంక్‌లోని అవకతవకలతో సంబంధం లేదని నేను అప్పట్లో చెప్పి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకంతో దర్యాప్తు జరిపించాలని సవాల్ చేశాను. ఆ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడండి’ అని శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పేరు ప్రస్తావించకుండా అన్నారు.

‘బిజెపి వాషింగ్ మెషీన్‌లా మారిందని ఇదంతా సూచిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చేరి నిష్కళంకులు కావచ్చు’ అని శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌పై నిరుడు జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పలువురు ఇతర ఎన్‌సిపి నేతలతో పాటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఆవిధంగా సీనియర్ పవార్ 1999లో స్థాపించిన పార్టీలో చీలిక తెచ్చారు. ప్రధాని మోడీ ఇప్పుడు నెహ్రూను, ఆయన సిద్ధాంతాన్ని విపరీతంగా విమర్శిస్తుంటారని శరద్ పవార్ ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News