హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ పేరుతో కాంగ్రెస్ రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పైసల్లేవు కానీ మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా? అని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బిఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని, హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తోందని, పేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజలకు బిజెపి ఆయుధం కాబోతుందని, ప్రజలకు తమ ప్రాణాలను అడ్డుపెడతామని, మా ప్రాణాలు తీశాకే ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లాలని, హైడ్రా దాడులపై బిజెపి సింగిల్ గానే ఉద్యమం చేస్తుందని బండి సంజయ్ ప్రకటించారు. కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని, తమిళనాడులో తండ్రి ముఖ్యమంత్రి…కొడుకు డిప్యూటీ సిఎం అయ్యారని, కాంగ్రెస్, బిఆర్ఎస్, డిఎంకెతో సహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.