కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ గురువారం భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో బిజెపి తుడిచిపెట్టుకుపోతుందన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సభలో ఆమె మాట్లాడుతూ, బిజెపికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువతతో ఢిల్లీకి ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అన్ని చోట్ల ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో తమను ఓడించేందుకు ప్రయత్నించిందని, కానీ విజయం సాధించలేకపోయిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, గోవా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో టిఎంసి గెలుపు కోసం కృషి చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో ఇతర పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ ఆహార ఉత్పత్తులపై జిఎస్టీ విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముర్మురాలపై కూడా జిఎస్టీ విధించారని, బిజెపి వాళ్ళు దానిని తినరా? అని ప్రశ్నించారు. స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా జిఎస్టీ విధించడం దారుణమని, ప్రజలు ఏం తింటారని ఆమె నిలదీశారు.