Monday, January 13, 2025

తెలంగాణలో బిజెపిదే అధికారం: జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిజెపిదే అధికారం
కాంగ్రెస్ అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారు
బిజెపితోనే తెలంగాణ సంపూర్ణాభివృద్ధి సాధ్యం
రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా
‘6 అబద్దాలు, 66 మోసాల’ సభలో నడ్డా సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దక్కిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 అబద్దాలు, 66 మోసాలు పేరుపై రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని జెపి నడ్డా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా నిర్వహిస్తున్న పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్ షేర్ చాలా తక్కువ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అని స్పష్టం చేశారు. కేంద్రంలో విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ మూడోసారి మోడీనే గెలిపించారని తెలిపారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం వింటూ వచ్చాం, కానీ మోడీ పాలనలో ఇంతవరకు ఆ మాట రాలేదని చెప్పారు.

19 రాష్ట్రాల్లో బిజెపిదే అధికారం
పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందన్న నడ్డా 13 రాష్ట్రాల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉందని, మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని, దేశ వ్యాప్తంగా మొత్తం 19 రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి అని, ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం అని ఘాటుగా విమర్శలు చేశారు. అంతేగాక బీజేపీతో నేరుగా పోటీలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఓటమి చెందిందని, ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుందన్న విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

తెలంగాణ, హిమాచల్, కర్నాటక రాష్ట్రాల్లో అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నడ్డా దుయ్యబట్టారు. ఇక రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా పేదలను మోసం చేస్తునే ఉందని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేలు ఏమయ్యాయని, రుణమాఫీ చేయకుండానే రైతులను మోసం చేసిందని రేవంత్ సర్కార్‌ను దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ రైతులు, మహిళలు, యువకులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించిందని నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయం, అబద్ధాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తెలంగాణ బీజేపీ నడుం బిగించిందని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నంపై హర్షం వ్యక్తం చేశారు.

బిజెపితోనే తెలంగాణ సంపూర్ణాభివృద్ధి
తెలంగాణ సంపూర్ణాభివృద్ధి, మంచి భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యమని భరోసా ఇచ్చారు. ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక పర్మినెంట్ గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ కమలాన్ని వికసింప చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో ఆరు, గోవా 3, మధ్యప్రదేశ్ లో 3, యూపీలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ మూడోసారి అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో రెండు, మణిపూర్‌లో మూడు, అసోంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు గెలుపు రికార్డులు బిజెపికి ఉన్నాయని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు.

చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో 64 సీట్లపై బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరగ్గా ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచిందని అన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. ఇక తెలంగాణలోనూ రూ.12 వేలు ప్రతి ఆటోడ్రైవర్‌కు ఇస్తామని మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పే మాయలోళ్లని జెపి నడ్డా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా మాయమాటలు చెప్పేవాడేనని తెలిపారు. తెలంగాణలో విద్యాభరోసా కార్డు హామీ ఇచ్చారని, ఆ భరోసా ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి దొరకలేదన్నారు. రైతులకు రూ.15 వేలు ఏమైందని ప్రశ్నించారు. కౌలు రైతులకు రూ.12 వేలు అందిందా? అని సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు ప్రశ్నించారు. అందుకే వీరిని తాను మాయలోళ్లని అంటున్నానని ఎద్దేవా చేశారు.

మహిళలకు రూ.2500 ప్రతీనెలా ఇస్తామని అన్నారని ఎవ్వరికైనా లభించిందా? అని ప్రశ్నించారు. షాదీ ముబారక్ ఒక తులం బంగారం, ఒక లక్ష రూపాయల నగదు ఎక్కడని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించిన నడ్డా అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో మూడో ఆర్థిక దిశగా వెళుతున్నామన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యతనిచ్చారన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తో అందరికీ న్యాయం చేశారన్నారు. తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ 1.12 లక్షల కోట్లు, వరంగల్ కు రూ.27 కోట్లు, టెక్స్ టైల్, రైల్వేకు 20 రెట్లు బడ్జెట్, వందేభారత్ మూడు వందేభారత్, ఐదు భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్నై, హైదరాబాద్ విశాఖపట్నం లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్‌లోనూ ఎయిమ్స్ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ అవాస్తవాలపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

కెసిఆర్ పాలనకు రేవంత్ సర్కార్ కొనసాగిపులా ఉంది
రాష్ట్రంలో కెసిఆర్ పాలన ముగిసిపోయిందని ప్రజలు అనుకుంటున్న తరుణంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కెసిఆర్ పాలనను కొనసాగిస్తున్నట్లుగా ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడిందో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించిన కిషన్‌రెడ్డి కెసిఆర్, రేవంత్ రెడ్డి డీఎన్‌ఏ కూడా ఒక్కటే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. సంవత్సరం గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్ బందీ
అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ బందీగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో మాదిరిగా భాగ్యనగర్‌లోనూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇట్లానే ఉంటే భాగ్యనగర్ మరో బంగ్లాదేశ్ గా మార్చే కుట్రలకు తెరదీశారని వ్యాఖ్యానించారు. ‘భాగ్యనగర్ ప్రజలారా… స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, కొమరం భీం, సేవాలాల్ మహారాజ్ లా మారతారా? లేక నక్సలైట్లుగా మారతారా? ఆలోచించండి”అని కోరారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆడుతున్న అబద్దాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలెవరూ ఆయనను సీఎంగా గుర్తించడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కూ మూడో స్థానం తథ్యమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేదిక సాక్షిగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయనిది నిజమా?, కాదా? వ్యవసాయ మంత్రే ఇది నిజమని ఒప్పుకున్నది వాస్తవం కాదా?, రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఎగ్గొట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొంటామని మాట ఇచ్చి తప్పింది నిజం కాదా? బోనస్ పేరుతో రైతులను వంచించింది మీరు కాదా? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తామన్నారు, మహిళలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని ఇచ్చిన వాగ్ధానాలు ఎంత వరకు అమలు చేశారని ప్రశ్నించారు. మాజీ సర్పంచులను అరిగోస పెడుతున్నారని, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రోడ్డున పడేసింది వాస్తవం కాదా?, మాజీ సర్పంచుల బతుకులను నాశనం చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలేనని బండి సంజయ్ ఆరోపించారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నయ్, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు ఇచ్చారని, ఈసారి మేయర్ పీఠం బీజేపీదేనని ఆయన ప్రకటించారు.

రేవంత్ అబద్ధాల పుట్ట
కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాల పుట్ట అని వ్యాఖ్యానించారు. రేవంత్ అబద్దాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని, ఆయన ఇచ్చిన హామీలు ఏమోగానీ చల్లగా బ్రతకనివ్వండి చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిల్లులు రాక 50 మంది వరకు సర్పంచ్‌లు చనిపోయారని, 50 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు రూ.12 వేలు దేవుడెరుగు మావాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

హైడ్రా పేరిట డ్రామా చేశారన్న ఈటల రాజేందర్ ఎప్పడు బుల్డోజర్లు వస్తాయా అని కంటిమీద కునుకులేకుండా మూసి పక్కన ఉన్నవారు బ్రతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి బీజేపీ అండగా నిలిచిందని, ధైర్యం ఇచ్చి కాపాడుకుందని అన్నారు. హైడ్రా, మూసి, లగచర్ల అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో పేదల, దళితుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. రేవంత్‌కి హామీలు అమలు చేసే దమ్ము లేదని అన్నారు. ఈ సభలో బిజెపి ఎంపిలు డికె అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జాతీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News