Monday, January 20, 2025

బిజెపికి అభ్యర్ధులు లేరనేది దుష్ప్రచారమే.. అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి పార్టీకి అభ్యర్థులు లేరనేది ఇతర పార్టీల దుష్ప్రచారమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 56 నియోజకవర్గాల్లో పర్యటిస్తే బిజెపి టికెట్ల కోసం నాయకులే పోటీ పడ్డారని ఆయన తెలిపారు. ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని చెప్పడానికి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలే నిదర్శనమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి పార్టీలతో పోల్చుకుంటే సంస్థాగతంగా బిజెపి బలంగా ఉందన్నారు. సంస్థాగతంగా బలంగా లేని పార్టీలు మనుగడ సాధించలేవన్నారు. బిజెపి సంస్థాగతంగా బలంగా ఉన్నందునే 18 రాష్ట్రాలలో అధికారంలో ఉందని ఆయన తెలిపారు. దేశంలో రెండుసార్లు బిజెపి విజయం సాధించిందని, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నామని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలు బిజెపికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, అందుకే సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేస్తునామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉంటే అందులో 80 శాతం కమిటీలను పూర్తి చేశామన్నారు. గురువారం బిజెపి బుత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్‌లో పాల్గొన్న బండి సంజయ్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో బిజెపి పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుందని అన్నారు. మీటింగ్‌లలో స్థానిక సమస్యలు ప్రస్తావించడంతో బిజెపి పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాల చోట్ల బిజెపి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వబోతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News