Thursday, December 19, 2024

దక్షిణాదిన బిజెపికి ఒక్క సీటు రాదు

- Advertisement -
- Advertisement -

సిఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదు దేశమంతా
తెలంగాణ మోడల్ అమలు కోసమే కులగణన చేపట్టపోవడానికి బిజెపి, కాంగ్రెస్‌లది
సమాన బాధ్యత ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కల్వకుంట్ల కవిత విమర్శలు

హైదరాబాద్ : దశాబ్దాల పాటు దేశా న్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రంగాల్లో వైఫల్యం చెందాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఇండియా కూటమి ప్రజల కోసం ఏమి చేస్తారో ఎజెండాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ద క్షిణాదిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదని ఎద్దేవా చేశారు. గురువారం చెన్నైలో ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సార్వత్రిక ఎన్నికలు 2024 ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అన్న అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌కు రూపాంతరం చెందడం, ఇండియా ఎన్డీఏ కూటములకు బీఆర్‌ఎస్ సమదూరంగా ఉండడం, తెలంగాణ అభివృద్ధి, బీజేపీ పక్షపాతం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవవహరించిన చర్చా గోష్టిలో కవితతో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై కూడా పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ దేశంలో భిన్నత్వం ఉందని, ఏదో ఒక జాతీయ పార్టీ వెంట ఉండాలన్న ప్రయోగం విఫలమైందని స్పష్టం చేశారు. నేడు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయని, బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల కంటే చాలా ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పెరిగిన వృద్ధి శాతమే అందుకు నిదర్శనమని, జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 75 ఏళ్ల పాటు పరిపాలించే సమయం లభించినప్పుడు ఏమీ చేయలేదని విమర్శించారు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని తమ పార్టీ భావిస్తోందని, తెలంగాణ తాము ఏమి చేశామో దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు. దేశమంతా తెలంగాణ అభివృద్ధి మోడల్ అమలు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో రూ.1.2 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం గత 10 ఏళ్లలోరూ. 3.7 లక్షలకు పెరిగిందని, దేశంలో ఇదే అత్యధికమని స్పష్టం చేశారు. గతంలో 66 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేదని, ఇప్పుడు 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను అసంతృప్తికి గురి చేశాయని మండిపడ్డారు. తమ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలో ఉండదల్చుకోలేదని తేల్చిచెప్పారు.
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వతంత్రంగా ఎక్కువ సీట్లు సాధించగలరని, బీఆర్‌ఎస్ మాత్రమే కాకుండా ఎవరైనా గేమ్ చేంజర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనమవుతుందని, ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమిలోనే పార్టీల అభిప్రాయం మారవచ్చునని తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత పొత్తులు కుదుర్చుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉదంతాలను మనం దేశంలో చూశామని, ఎన్నికల ముందు పొత్తులు చారిత్రకంగా విజయవంతం కాలేదన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతీ పార్టీ తమతమ వ్యూహాలపై పునరాలోచిస్తాయని, ఇండియా కూటమిలో కొనసాగాలా లేదా స్వతంత్రంగా పోటీ చేయాలా వంటి అంశాలతో పాటు అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం వంటి అంశాలపై ఆ పార్టీలు ఆలోచన చేస్తాయని అభిప్రాయపడ్డారు. బీజేపీని గద్దెదించాలన్నది ఇండియా కూటమి యొక్క ఏకైక ఎజెండా అని, కానీ ప్రజల కోసం ఇండియా ఎజెండా ఏమిటి అని ప్రశ్నించారు. బీజేపీని గద్దెదించడమే ఇండియా కూటమి లక్ష్యమైతే మరి ప్రస్తుత ప్రభుత్వం కంటే ప్రజలు ఏం మెరుగైన పనులు చేస్తారని అడిగారు. బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కొట్లాడుకుంటాయని, కానీ ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయని, కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పోరు, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలపడుతాయని, మరి ఇలాంటప్పులు సీట్లను ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. ఇది నిజమైన పొత్తులని ప్రజలకు ఎలా విశ్వాసం కల్పిస్తారని అడిగారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన శూన్యమని ధ్వజమెత్తారు.

తెలంగాణకే కాకుండా తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మధురై ఎయిమ్స్ గత 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ దృష్టిమళ్లింపు రాజకీయాలు చేస్తోందని, అవి కొన్ని సార్లు పనిచేశాయని, కానీ మళ్లీమళ్లీ పనిచేయబోవని విశ్లేషించారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయని, దీనిపై బీజేపీ వైఖరి ఏమిటని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలైను ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోడానికి సిద్ధంగా లేవని తేల్చిచెప్పారు. దీనికి బీజేపీ వద్ద ఉన్న పరిష్కార మార్గం ఏమిటని అడిగారు.

అలాగే, ఉత్తర ప్రదేశ్ లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిలదీశారు. కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించిందని, కానీ ఇతర రాష్ట్రాల డిమాండ్లను మాత్రం విస్మరించిందని విమర్శించారు. ఇష్టమున్న రాష్ట్రాలకే నిధులు ఇస్తున్నదని, దేశ ప్రజలపై రూ. 100 లక్షల కోట్ల రుణభారాన్ని మోపిందని ఎండగట్టారు. గతంలో పనిచేసిన ప్రధానమంత్రులంతా కలిసి రూ. 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వమే రూ. 100 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. ఈ అన్ని అంశాలపై సమాధానం చెప్పాలన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని సూచించారు. 2014 ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఇతర దేశాల చొరబాటును అడ్డుకుంటామని ప్రకటించారని, కానీ చైనా మన దేశ భూభాగంలో రోడ్ల వంటి నిర్మాణాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో మూడున్నరేళ్ల కాలంలో పూర్తి చేశామని, 73 లక్షల ఎకరాలకు ఈ రోజు ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోందని చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులను బీజేపీ పార్టీ 100 జన్మలెత్తినా చేయలేదని స్పష్టం చేశారు. తాము నిజాయితీగా పనిచేస్తున్నాము కాబట్టే ప్రజలు రెండు సార్లు తమ పార్టీని గెలిపించారని, మరోసారి బీఆర్‌ఎస్ గెలవబోతుందని ప్రకటించారు.మోదీ ప్రభుత్వం అశ్రిత పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించకపోతే మరి రూ. 12 లక్షల కోట్ల మేర కార్పొరేట్ల రుణాలను ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదని నిలదీశారు. ఒక వ్యక్తి ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమారుడు అయినంత మాత్రానా బీసీసీఐని గెప్పిట్లోకి తీసుకున్న విషయం వాస్తవం కాదా అని అడిగారు.

కుటుంబ పాలన గురించి మాట్లాడే బీజేపీ జ్యోతిరాధిత్య సింధియాను కేంద్ర మంత్రిని ఎలా చేసిందని అన్నారు. గతంలో తమిళనాడులో డీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నాడు, మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపెట్టుకున్న నాడు అవి కుటుంబ పార్టీలని తెలియదా అని అడిగారు. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అన్న విషయం బీజేపీకి తెలియదా అని ప్రశ్నించారు. దక్షిణాదిలో బీజేపికి ఒక్క సీటు రాదని తేల్చిచెప్పారు. కులగణననే కాకుండా సాధారణ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా వల్ల 2021లో చేపట్టాల్సిన జనగణన వాయిదా పడిన తర్వాత మళ్లీ ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా కులగణను చేపట్టామని, దాని వల్ల అన్ని వర్గాల ప్రజలకు తగిన విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు.

దేశంలో కులగణన జరగకపోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మతరాజకీయాలపై కవిత స్పందిస్తూ రాజకీయ హిందువు, ఆచరించే హిందువులు ఉన్నాయని తెలిపారు. బీజేపీది రాజకీయ హిందుత్వమని, దక్షిణాదిన ప్రజలు ఆచరించే హిందువులని చెప్పారు. తాము దేవాలయాలకు వెళ్తామని, అన్ని సంప్రదాయాలు పాటిస్తామని వివరించారు. అయితే, రాజకీయవేత్తగా ప్రజాజీవితంలో అన్ని వర్గాలను తాను సమానంగా చూస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News