రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత 17 కోట్ల మంది సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు రూ. 12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ రిపోర్టు, సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చాయన్నారు. 9 సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన పాలన అందిస్తున్నారు. ప్రపంచంలోనే భారత్ 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని, యూకే లాంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టి భారత్ ముందువరుసలో నిలిచిందన్నారు.
పేదప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, రాష్ట్రంలో గతంలో పాలించిన పార్టీ నాయకులు పేద ప్రజలకు ఇండ్లు కట్టించకుండా వేధించారని విమర్శించారు. దేశంలో నెలనెలా ప్రతి పేదవాడికి 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తూ పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. భారతీయ సంస్కృతి పునరుజ్జీవం కల్పించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో కటిక చీకట్లు అలుముకునేవని, నేడు సంపూర్ణ విద్యుత్ ఇస్తూ వెలుగులు నింపిందన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు తమ పార్టీ గెలుస్తుందని, డబుల్ డిజిట్ సాధించి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు తమ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు.