న్యూఢిల్లీ: తొలి విడతగా పశ్చిమ బెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బెంగాల్‌లో పోలింగ్ జరిగిన 30స్థానాల్లో బిజెపి 26 సీట్లను గెలుచుకుంటుందని, అసోంలో 47 స్థానాల్లో 37 స్థానాలను సొంతం చేసుకుంటుందని చెప్పారు. ‘బూత్‌స్థాయి కార్యకర్తలు, మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పగలుగుతున్నాను. పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకుగాను 26 స్థానాలను బిజెపి గెలుచుకుంటుంది. అసోంలో 47 స్థానాలకుగాను 37 స్థానాలకు పైగా గెలుచుకుంటామనే స్పష్టమైన సంకేతాలు అందాయి’ అని ఆదివారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి 200కు పైగా సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. బెంగాల్‌లో ఎలాంటి హింసకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్‌కు, పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మార్పుకోసం, మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు వేయాల్సింందిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రాం ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చుతూ, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని, ఎన్నికలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
BJP will win 26 of 30 seats in Bengal and Assam: Shah