కమలం తీర్థం పుచ్చుకున్న బిఆర్‌ఎస్ సీనియర్ నేత పిఎల్ శ్రీనివాస్
దేశంలో నీతివంతమైన పాలనను ప్రధాని మోడీ అందిస్తున్నాడు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సికింద్రాబాద్ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పిఎల్. శ్రీనివాస్ పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిఎల్ శ్రీనివాస్ లాంటి అనుభవజ్ఞులైన నాయకుల సేవలను తమ పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు.
దేశంలో నీతివంతమైన, శక్తివంతమైన ప్రభుత్వంగా మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనే కాంక్ష దేశ ప్రజల్లో బలంగా ఉందన్నారు. రాష్ట్రంలో తాజా, మాజీ ప్రభుత్వాల వైఖరి ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని వెల్లడించారు.
అదే విధంగా ఉదయం బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని బ్రిటీష్ మత మార్పిడులకు వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. సాంఘీక దురాచారాలను రూపుమాపేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం బిజెపి పని చేస్తుందని తెలిపారు. ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించామని, బంజారా సమాజం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని వెల్లడించారు.