Sunday, November 17, 2024

ఇప్పటికే 310 సీట్లు దాటాం

- Advertisement -
- Advertisement -

యుపి సభల్లో అమిత్ షా
కాంగ్రెస్‌కు 40, ఎస్‌పికి 4
బంధుప్రీతితో ప్రతిపక్షం
రిజర్వేషన్ల కోటాకు ఎసరు

సిద్థార్థనగర్ / సంత్ కుబీర్ నగర్ : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నిర్ణీత రీతిలో విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికి ముగిసిన ఐదు విడతల పోలింగ్ సరళిని చూస్తే బిజెపి 310 సీట్ల సంఖ్యను దాటిందని, మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇక కాంగ్రెస్‌కు ఈసారి 40 స్థానాలు కూడా రావడం కష్టమే అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్థార్థనగర్‌లో అమిత్ షా గురువారం దొమరియగంజ్ బిజెపి అభ్యర్థి జగదాంబిక పాల్ గెలుపు కోసం జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌కు 40 లోపు, ఇక ఈ పార్టీ మిత్రపక్షం ఎస్‌పికి నాలుగు స్థానాలు దక్కుతాయని అమిత్ షా వెల్లడించారు.

ఇప్పటికే బిజెపి 310 దాటి మరింతగా ముందుకు వెళ్లే దిశలో ఉందన్నారు. రాష్ట్రంలోనే సంత్ కబీర్ నగర్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన విపక్ష నేతలకు బంధుప్రీతి, స్వార్థ బుద్ధి తప్పితే మరోటి లేదన్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ప్రస్తావించుకోవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడిని సిఎం చేయాలని అనుకుంటారు. ఉద్ధవ్ థాకరే తన కుమారుడు ఎప్పుడు సిఎం అవుతాడా? అని చూస్తాడు. శరద్ పవార్‌కు కూతురిని ఈ స్థానంలో చూడాలని తపన ఉంది. ఇక సోనియా గాంధీ తన కుమారుడు ఎప్పటికైనా ప్రధాన మంత్రి కాకపోతాడా అనే ఆశ ఉంది. స్టాలిన్, మమత బెనర్జీ ఈ విధంగా పలువురికి వారి వారి రాజకీయ వారసులే అధికారంలోకి వచ్చి తీరాలనే ఆరాటం ఉందని విమర్శించారు.

ప్రతిపక్షాలకు రిజర్వేషన్లపై రాజకీయ ఆలోచనలు తప్పితే మరో దృష్టి లేదన్నారు. ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకుల భద్రతకు చివరికి ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల రిజర్వేషన్ కోటాకు కూడా గండిపెడుతున్నాయని మండిపడ్డారు. రాహుల్ బాబాకు, అఖిలేష్ యాదవ్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలతో కళ్లకు గంతలు కట్టుకుని ఉన్నారని వారు ఓ వర్గాన్ని ఎంచుకుని ప్రయోజనాలు కల్పిస్తారని, ఈ క్రమంలో కోట్లాది మంది బడుగు వర్గాల కోటాలకు ఎసరు పెట్టిన వారవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు సరైన విధానాలు అంటూ ఏమీ లేవు. పాకిస్థాన్ నేతలు పిఒకె తమది అంటారు. ఇక ఇదే వరుసలో కాంగ్రెస్ నేతలు బయలుదేరి పాకిస్థాన్‌ను ఏమి అనవద్దు, వారి వద్ద ఆటంబాంబు ఉందంటారని అంటే వారు ఏం చేసినా మనం చూస్తూ కూర్చోవాలనేదే ఈ పార్టీ సందేశమా అని ప్రశ్నించారు. బిజెపి వారికి అణుబాంబులు ఇతరత్రా ధమ్కీలతో భయపడే స్థితి లేదని అమిత్ షా చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే, దీనిని మనం ఖచ్చితంగా వెనకకు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News