మూడోసారి అధికారం బిజెపి కైవసం
కౌంటింగ్ ఆరంభంలో హస్తం
ఆధిపత్యం..కాసేపట్లోనే చతికిల
సున్నాకే పరిమితమైన ఆప్
సత్తా చాటని ఐఎన్‌ఎల్‌డి
రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం
సిఎంగా మళ్లీ సైనీకే అవకాశం?
హర్యానా ఫలితంపై కాంగ్రెస్
అనుమానాలు
జెకెలో ఆప్ బోణీ
పిడిపి ప్రభావం
నామమాత్రమే
లోయలో బిజెపికి ఎదురుదెబ్బ
జమ్మూలోనే ఆధిపత్యం
కాంగ్రెస్, ఎన్‌సిలకే అధికార పగ్గాలు కమలానికి
కలిసి రాని 370 ఆర్టికల్ రద్దు ఒమరే సిఎం
రెండు రాష్ట్రాల్లోనూ
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం హర్యానాలో కాంగ్రెస్ ఆనందోత్సాహాల నుమొగ్గలోనే తుంచివేసి చరిత్రాత్మక రీతిలో మూ డవ సారి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ కూడా ఎగ్జిట్ పోల్స్ సూచనలకు విరుద్ధంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) కాంగ్రెస్ కూటమికి భారీ విజయం చేకూరింది. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌కు తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ఎన్ సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 46 కాగా బిజెపి 48 సీట్లను గెలుచుకున్నది. కాం గ్రెస్‌కు 37 సీట్లు లభించాయి. 1966లో ఏర్పాటైనప్పటి నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరుస గా మూడవ సారి విజయం సాధించలేదు. హర్యానాలో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న ఓమ్ ప్రకా శ్ చౌతాలా సారథ్యంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) రెండు సీట్లు గెలుచుకోగా, బిజెపితో పొత్తు పెట్టుకున్న దుష్యంత్ చౌతాలా నే తృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జెజెపి) ఒ క్క సీటూ దక్కించుకోలేకపోయింది.
ఒక దశాబ్దం లో మొదటిసారిగా 90 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ ఎన్‌సి కూటమి 48 సీట్లు సాధించగా, బిజెపికి 29 సీట్లు లభించాయి. మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిప) మూడు సీట్లు గెలుచుకున్నది. ఇక ఆశ్చర్యకర రీతి లో ఆప్ అభ్యర్థి మెహ్‌రాజ్ మాలిక్ దోడాలో గెలిచారు. బుద్గామ్, గందెర్‌బల్ నియోజకవర్గాల్లో గె లిచిన ఎన్‌సి నేత ఒమర్ అబ్దుల్లా బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మమ్మల్ని నాశనం చేయాలనుకున్నవారు మట్టికరిచారు’ అని ఒమర్ ఆ పా ర్టీనిదృష్టిలోపెట్టుకునివ్యాఖ్యానించారు.ప్రభుత్వం ఏర్పాటు గురించి మీడియా ప్రశ్నించినప్పు డు ఫ లితాలు పూర్తిగా వెల్లడయ్యే వరకు వేచి చూడండి అనిసమాధానం ఇచ్చారు.
కాగా, కేంద్ర పాలిత ప్రాంతంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చుననే సూచనలు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎంఎల్‌ఎలు ప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించగలరని ప్రతిపక్షాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి.కాంగ్రెస్‌కు అఖండ విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ సూచించిన హర్యానాలో జాట్ ప్రముఖుడు భూపీందర్ సింగ్ హూడాపై భారీగా ఆధారపడడం, దళిత నాయకురాలు కుమారి సెల్జాను పక్కన పెట్టడం వంటి తప్పుడు నిర్ణయాలు ఆ పార్టీకి నష్టం చేశాయి. జాట్‌యేతర వోట్లను బిజెపి సంఘటితం చేసుకోవడం కాంగ్రెస్‌ను మరింతగా దెబ్బ తీసింది. జాట్ సమాజాన్ని ఆకట్టుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ పట్టణ, పారిశ్రామిక కేంద్రాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, రేవారి, మహేంద్రగఢ్‌లలో రాజకీయంగా ప్రభావశీలమైన అహిర్వాల్ వర్గాన్ని అలక్షం చేసింది. బిజెపి 2019తో పోల్చితే తన ప్రదర్శనను మెరుగుపరచుకున్నది.
2019లో పార్టీ 40 సీట్లు గెలుపొందింది. బిజెపి ఈమారు జెజెపితో జత కట్టింది. సరికొత్త అభ్యర్థులను నిలబెట్టడం, ఒబిసి, ఎస్‌సి సమాజాలను ఆకట్టుకోవడం అనే పార్టీ వ్యూహం కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. హర్యానాలో బిజెపి విజయానికి కీలక సూత్రధారిగా నయాబ్ సింగ్ సైనికి ఘనత దక్కుతుంది. ఒబిసి అయిన సైనీ ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత బిజెపి ఎన్నికల ప్రచారానికి ప్రధాన నేత అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, రాష్ట్రంలో వరుసగా మూడవ విడత పార్టీకి విజయం సాధించడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. నువ్వా నేనా అనే రీతిలో ఫలితాలు రాగలవని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సూచించిన జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ సంచలనాత్మకంగా తిరిగి అధికారంలోకి వచ్చింది.
ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలసి 49 సీట్లు గెలుచుకున్నది. తమది ‘పోలీస్ రాజ్ కాకుండా లోగోం కో రాజ్’గా ఉంటుందని ఎన్‌సి అధినేత ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. బిజెపి జమ్మూ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించినా కాశ్మీర్‌లోయలో పేలవ ప్రదర్శన చేసింది. శాంతి, అభివృద్ధి, సౌభాగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తూ ఆ ప్రాంతాన్ని ‘నయా కాశ్మీర్’గా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానంచేసినా ఆ మార్పు ఆ ప్రాంతంలో పార్టీకి వోట్ల రూపంలో కానరాలేదు.
కాంగ్రెస్ అభ్యర్థి, మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ తన తొలి యత్నంలోనే హర్యానాలోని జులానా సీటు గెలుచుకున్నారు. ఒలింపియన్ వినేష్‌కు 64548 వోట్లు లభించాయి. ఆమె తన సమీప బిజెపి ప్రత్యర్థి యోగేష్ కుమార్‌ను 6553 వోట్ల తేడాతో ఓడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో షాకింగ్ ఫలితం తరువాత ఆమెను కాంగ్రెస్ నామినేట్ చేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఎదురుదెబ్బ గా పార్టీ తమ నేత అర్వింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హర్యానాలో ఒక్క సీటు కూడా లభించలేదు. అయితే, ఆప్ అభ్యర్థి మెహ్‌రాజ్ మాలిక్ జమ్మూ కాశ్మీర్‌లోని దోడా అసెంబ్లీ సీటు గెలవడం గమనార్హం. కాగా, హర్యానాలో ఆప్ నష్టం చెప్పుకోదగినది. ఇండియా కూటమిలో తన మిత్ర పక్షం కాంగ్రెస్‌తో ఆప్ సీట్ల పంపకం ఒప్పందం కుదరలేదు.
జెకె ముఖ్యమంత్రి ఒమర్
ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. మిత్ర పక్షం కాంగ్రెస్‌తో కలసి ఎన్‌సి కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాబోతున్నది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారు’ అని ఫరూఖ్ అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. 370 అధికరణం రద్దును జెకె ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేందుకు ఈ తీర్పు ఒక నిదర్శనం అని ఎన్‌సి అధ్యక్షుడు అన్నారు. కొత్త సంస్థలను సృష్టించడం ద్వారా తమ పార్టీని నాశనం చేయడానికి గత ఐదు సంవత్సరాల్లో పెక్కు ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆ సంస్థలు ఈ ఎన్నికల్లో మట్టి కరిచాయని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మంగళవారం చెప్పారు. జెకె మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన సమీప పిడిపి ప్రత్యర్థులను ఓడించి గందర్బల్, బుద్గామ్ సీట్లను గెలుచుకున్నారు.