Monday, December 23, 2024

వెనక్కి తగ్గిన బీజేపీ.. థాక్రే వర్గానికి లైన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాను వెనక్కి తగ్గి, ఉద్ధవ్ థాక్రే వర్గానికి లైన్ క్లియర్ చేసింది. ఈ పరిణామం అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక విషయంలో చోటు చేసుకుంది. ఆ పోటీ నుంచి తన అభ్యర్థి ముర్జీ పటేల్‌ను ఉపసంహరించుకుంది. పలువురు ప్రముఖ నేతల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ ఈమేరకు నిర్ణయించింది. ప్రస్తుతం రుతుజా లట్కే … అంధేరీ ఈస్ట్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మరణించడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ క్రమంలో ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో దింపకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాక్రే నిర్ణయించారు. అభ్యర్థిని నిలబెట్టకూడదని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. మహారాష్ట్ర పాటిస్తోన్న సంప్రదాయాన్ని అనుసరించి తన విన్నపానికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని, తద్వారా ప్రజా ప్రతినిధికి నివాళి అర్పించినట్లవుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు తన వర్గం ఎమ్‌ఎల్‌ఎ నుంచి కూడా ఇదే తరహా అభ్యర్థన వచ్చింది. ఆమె భర్తకు నివాళిగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టకుండా చూడాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా అదే మాట అన్నారు. రమేశ్ లట్కే చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ విన్నపాల నేపథ్యంలో కమలం పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది. ఇక నవంబర్ 3న ఈ ఉప ఎన్నిక జరగననుంది.

BJP Withdraws Candidate from Andheri(East) bypoll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News