Monday, December 23, 2024

ఒక గెలుపు, రెండు ఓటములు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: భారతీయ జనతా పార్టీ గుజరాత్‌లో ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసాధారణ చరిత్రను సృష్టించుకొన్నది. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ ఒక్క సంస్థా ఇవ్వనన్ని సీట్లను అది ఈసారి సాధించుకొన్నది. ఉదాహరణకు ఎన్‌డిటివి బిజెపికి 132 స్థానాలు వస్తాయని చెప్పింది. ఎబిపి న్యూస్, సి ఓటరు 128 నుంచి140 వరకు, టైమ్స్ నౌ ఇటిజి 135 నుంచి 145 సీట్లు బిజెపి ఖాతాలో వచ్చి చేరుతాయని జోస్యం చెప్పాయి. ఈ అత్యధిక అంచనాలన్నింటినీ దాటిపోయి కమలం పార్టీ గుజరాత్ అసెంబ్లీలో గల 182లో 156 స్థానాలు గెలుపొంది దిగ్విజయ ఢంకా మోగించింది.

గత ఎన్నికల్లో 70 స్థానాలు గెలుచుకొని తానింకా రంగంలో వున్నానని చాటుకొన్న కాంగ్రెస్ ఈసారి కేవలం 17 సీట్లను మాత్రమే సంపాదించి శూన్య స్థితికి చేరుకొంటున్నదా అనిపించింది. కొత్తగా అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 5 స్థానాలు సాధించుకోగలిగింది. అంతకంటే మించి కాంగ్రెస్ ఓట్లను గణనీయంగా చీల్చుకొన్నది. ఆ విధంగా బిజెపి మార్మోత విజయానికి ఉపయోగపడింది. 2018 ఎన్నికల్లో 90 స్థానాల వద్దనే ఆగిపోయి అతి కష్టంగా వరుసగా ఆరోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ఐదేళ్ళు గడిచే సరికి ఇంతగా సూపర్ స్టార్ అయిపోడం, 1985లో మాధవ్ సింహ్ సోలంకి నాయకత్వంలో కాంగ్రెస్ గెలుచుకొన్న 149 స్కోర్‌ను కూడా మించిపోడం విశేషం. ఇందుకు కారణాలను జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి.

బిజెపి తరపు ప్రచారాన్నంతటినీ ప్రధాని నరేంద్ర మోడీయే తన భుజస్కంధాల మీద వేసుకొని మోశారు. ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత నుంచి రెండో విడత పోలింగ్ ముందు వరకు 30 సభల్లో ఆయన ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్‌తో కలిసి ప్రకటించవలసిన గుజరాత్ షెడ్యూల్‌ను ఇసి షెడ్యూల్‌ను బాగా ఆలస్యం చేసింది. ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటించి ప్రజలను అనేక రకాలుగా ప్రభావితం చేయడానికి అవకాశం కలిగించిందనే విమర్శకు అవకాశం ఇచ్చింది. ఉచితాల కంటే అనుచితాలుండవని ప్రధాని మోడీ బహిరంగంగా వాటిని చీ కొట్టారు.

అందుకు విరుద్ధంగా బిజెపి తన మేనిఫెస్టోలో ఆడ పిల్లలకు ఉచిత విద్య, 20 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలను విచ్చలవిడిగా గుప్పించింది. ప్రధాని అన్ని ఎన్నికల్లోనూ తన మొహం చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. దానిని కూడా మోడీ చాకచక్యంగా వాడుకొన్నారు. చూశారా ఖర్గే నన్ను రావణుడితో పోల్చారు అని ప్రజలకు ఫిర్యాదు చేసి వారిలోని హిందుత్వను రెచ్చగొట్టి ఓటుగా మార్చుకోగలిగారు. అన్ని ఎన్నికల్లోనూ బిజెపి తరపున మోడీయే ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ రావణుడి మాదిరిగా ఆయనకేమైనా వంద ముఖాలున్నాయా అని ఖర్గే ప్రశ్నించడం బిజెపికి బాగా మేలు చేసి వుండవచ్చు.

కాంగ్రెస్ వారు తమ హానిని తమ నాలుకల మీదనే మోస్తూ వుంటారు. దట్టించిన మతోన్మాదంతో ఊగిపోయే వారు అధికంగా వుండే గుజరాత్‌లో ఖర్గే ఆ వ్యాఖ్య ఎందుకు చేశారో! మోడీ తనలో గుజరాత్ ఆత్మగౌరవాన్ని చూడాలని, ప్రతి ఒక్క గుజరాతీ రాష్ట్ర ఉజ్వల స్థితికి దోహదం చేసిన వారేననే అభిప్రాయం స్ఫురించేలా నినాదాన్ని అందించారు. ఆ నినాదంతో వేల మంది సెల్ఫీలు తీసుకొనేలా చేశారు. వాస్తవానికి గత ఎనిమిదేళ్ళ మోడీ పాలనలో దేశం అనేక సమస్యల్లో పడి కొట్టుకొంటున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆకాశాన్నంటాయి. పెద్ద నోట్ల రద్దు మోడీ ప్రభుత్వ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బ తీసింది. దాని గురించి ఘనంగా చెప్పుకోలేకపోయే పరిస్థితిని సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్ల మాదిరిగా గుజరాత్ ఓటర్లు ఆలోచించి వుంటే అక్కడ బిజెపి అడ్రసు లేకుండా తుడిచిపెట్టుకుపోయి వుండాల్సింది.

కాని 2002 గోధ్రా అనంతర అల్లర్లను రెచ్చగొట్టారనిపించుకోడం ద్వారా బిజెపి వారు గుజరాత్‌ను హిందుత్వ ప్రయోగశాలగా చేశారు. దానిని ముద్దుగా మోడీత్వం అని పిలుచుకొనే స్థితిని తీసుకు వచ్చారు. అది మళ్ళీ ఇప్పుడు బిజెపికి ఆ రాష్ట్రంలో బాగా మేలు చేసింది. ఆప్ ప్రవేశం, మతతత్తం, గుజరాత్ ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టడం బిజెపికి ఈ ఘనాతిఘన విజయాన్ని కట్టబెట్టాయి. ఈ ఒక్క విజయంతోనే దేశంలో బిజెపికి ఇక ముందు తిరుగుండదని, 2024లో అది తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రచారం గాలిని హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తీసి వేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పడిలేచిన కెరటమైంది. బిజెపి నుంచి అధికారాన్ని కైవసం చేసుకొన్నది.ఢిల్లీ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ముచ్చటైన విజయాన్ని మూటగట్టుకొన్నది. అక్కడ బిజెపి ఆధిపత్యానికి తెర దించింది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఢిల్లీలలో ఇప్పుడు బిజెపి అధికారంలో లేకపోడాన్ని గమనించాలి.బిజెపికి గల పటిష్ఠమైన పార్టీ నిర్మాణం అసాధారణమైనదే.కాని ఒకేసారి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు అది తన సామర్థాన్ని నిరూపించుకోజాలదని అర్థమవుతున్నది. అలాగే అన్ని రాష్ట్రాలు గుజరాత్‌లు కాజాలవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News