Thursday, January 23, 2025

గుజరాత్‌లో బిజెపికి హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు అన్నింటిని బద్దలు చేసి మరోసారి కేంద్రంలో కూడా విజయం సాధింపబోతున్నారనే సంకేతం అని పలువురు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ విజయం బిజెపి శ్రేణులను ఆనందోత్సవాలు గురిచేయడం నిజమే. ఒక విధంగా అనూహ్య విజయం కూడా. అయితే ఈ విజయం కోసం ప్రతిపక్షాల బలహీనతలతో పాటు స్వయంగా ప్రధాని మోడీ తన శక్తియుక్తులు అన్నింటిని సమకూర్చి ఎంతో కష్టపడాల్సి రావడం మరచిపోలేము. ఈ విజయం సంబరాలకు దారితీయడంతో పాటు మరోవంక బిజెపిలోని బలహీనతలను, రాబోయే రోజులలో ఆ పార్టీ ఎదుర్కోబోయే ప్రమాదాలను సహితం వెల్లడిస్తున్నట్లు గమనించాలి. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగితే ప్రధాని అంతగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్‌లో సహితం ప్రధాని విశేషంగా కష్టపడ్డారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికను స్వయంగా పర్యవేక్షించారు. పార్టీలో శృతిమించిన ముఠా తగాదాల కారణంగా నేరుగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డానే తన సొంత రాష్ట్ర రాజకీయాలకు దూరం గా ఉండమని స్పష్టం చేశారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాదాపు 12 నియోజక వర్గాలను తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా బిజెపి కోల్పోయింది. అంటే, ఎన్నికల యాజమాన్యంలో బిజెపి ఆధిపత్యానికి పరిమితులు స్పష్టం అవుతున్నాయి. 2018 తర్వాత కాంగ్రెస్ మొదటి సారిగా హిందీ ప్రాంతంలో ఓ రాష్ట్రాన్ని గెల్చుకోవడం గమనించాలి. హిందీ ప్రాంతాలలో తిరిగి పార్టీ నిలదొక్కుకునేందుకు ఓ మార్గంగా మార్చుకోగలిగితే బిజెపికి పెనుసవాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. వచ్చే ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఉత్సాహం కలిగించేందుకు దోహదపడవచ్చు. ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపికను దాదాపు అమిత్ షా పర్యవేక్షిస్తూ వచ్చారు. కానీ మొదటిసారిగా, మోడీ స్వయంగా అభ్యర్థుల ఎంపిక జరిపారు. గుజరాత్‌లో మొత్తం 49 మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు.

None of Modi's promises materialized

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిజెపి ఎంఎల్‌ఎలు, కార్పొరేటర్లు మొత్తం మీద ప్రజలకు దూరం అయ్యారని, అవినీతికి మారుపేరుగా మారారనే ఆరోపణలు విస్తృతంగా వ్యాపించాయి. గుజరాత్‌లో 40 శాతం మంది అభ్యర్థులను మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థుల వ్యతిరేకత నుండి కొంత ఉపశమనం పొందారు. కానీ ఢిల్లీలో ఆ విధంగా చేయలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఢిల్లీలో ఏడుగురు ఎంపిలు బిజెపి వారే. అయితే వారిలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మీనాక్షి లేఖి మినహా మిగిలిన ఎంపిలు ఎవ్వరూ పార్టీ కార్యకర్తలకు సహితం అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఇక బిజెపి పాలన అవినీతికి మారుపేరుగా మారింది. అందుకు భిన్నంగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామాన్య ప్రజలకు, అణగారిన వర్గాలకు చేరుకొనే విధంగా వ్యవహరిస్తున్నారు.

గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, తాము దేశం అంతా ప్రచారం చేసుకొంటున్న ‘గుజరాత్ నమూనా’ చూసి ఓట్లు వేయమని అడగవలసింది పోయి, ఎప్పుడో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను, అప్పటి వరకు ఒక్క సీట్ కూడా గెలవని ఆప్ ను ఉగ్రవాదులను సమర్ధించేవారుగా స్వయంగా ప్రధాని చిత్రీకరించడం రాజకీయాలను ఏ స్థాయికి తీసుకు వెళ్లారో వెల్లడి అవుతుంది.

ఇక నర్మదా సరోవరం కారణంగా భూములు కోల్పోయిన పేదల పక్షాన చరిత్రాత్మక పోరాటం జరిపిన మేధా పాట్కర్‌పై ప్రధాని చేసిన ఆరోపణలు, విమర్శలు ఆయన స్థాయికి సొగసు కలిగించవు. భారత దేశ చరిత్రలోనే భూసేకరణలో, ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితుల పరిహారంతో పాటు, పునరావాసానికి సహితం ఒక భాగంగా చేసిన ఘనత ఆమెకు దక్కుతుంది. పైగా, ఇతర ఎన్‌జిఒల మాదిరిగా ఆమె విదేశీ నిధులను తిరస్కరిస్తూ, కేవలం ప్రజాబలంతో పోరాటాలు నిబద్ధతతో సాగించారు. పశ్చిమ బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైబడిన సిపిఎం పాలన అటువంటి ఉద్యమం కారణంగానే ముగిసినదని గుర్తించాలి.
ఆమె రాజకీయ విధానాలు, విధానపరమైన కొన్ని అభిప్రాయాలతో మనకు విభేదాలు ఉండవచ్చు. కానీ ఆమె నిజాయితీని, ఉద్యమ స్ఫూర్తిని, అణగారిన వర్గాల కోసం చేసిన త్యాగాలను విస్మరించలేము. 27 ఏళ్ళ పాటు పరిపాలన సాగించిన తర్వాత కూడా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే సుమారు రూ. 1 లక్ష కోట్ల వ్యయం కాగల ప్రాజెక్ట్‌లకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపడం గమనిస్తే బిజెపిలో నెలకొన్న అభద్రతా భావాన్ని వెల్లడి చేస్తుంది. గుజరాత్ ఎన్నికలో బిజెపిని కట్టడి చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలు సహితం మరోసారి స్పష్టం చేశాయి. ఒక వంక నరేంద్ర మోడీ ఉద్వేగభరితంగా, కేజ్రీవాల్ ఉధృతంగా ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ సామాజిక వర్గాల సమీకరణపై ఆధారపడుతూ, ఇంటిని తిరుగుతూ స్థానికంగానే పరిమితమయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్ప పార్టీ ప్రముఖ నాయకులు ఎవ్వరూ చెప్పుకోదగినంతగా ప్రచారం చేయలేదు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఓ డజన్ నియోజక వర్గాలలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయడంతో కొంత కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ మొక్కుబడిగా రెండు రోజులు ప్రచారం చేసి వెళ్లారు. ఓట్ల సరళిని గమనిస్తే బిజెపి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్, ఆప్ విఫలమైనట్లు స్పష్టం అవుతుంది. బిజెపిని కట్టడి చేసే విధంగా కాంగ్రెస్ స్పష్టమైన వ్యూహాలను రూపొందించుకోలేకపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ పార్టీ ఓ విధంగా నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కోవడమే అందుకు ప్రధాన కారణం. అయితే, ఎన్నికల వ్యూహాలతో బిజెపి అందరికంటే ముందుండటం గమనార్హం. గుజరాత్ ఎన్నికలు కాగానే అమిత్ షా 2024 ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. కీలకమైన జెడియు, అకాలీదళ్, శివసేన (ఠాక్రే) వంటి మిత్రపక్షాలు దూరం కావడంతో ఇప్పుడు బలమైన మిత్రపక్షం అంటూ ఏదీ మిగలలేదు. దాదాపు ఒంటరిగా మిగలడంతో ప్రస్తుతం ఉన్న 303 లోక్‌సభ సీట్లలో 50 నుండి 70 వరకు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నష్టాలను పరిమితం చేసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు పార్టీ అసలు గెలుపొందని 144 సీట్లపై, ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కొంత మేరకు నష్టం ఇక్కడ పూర్తి చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఫలితాలు విశ్లేషించుకుంటే బిజెపికి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థులను ఏ మేరకు పోటీకి దింపగలవనే అంశంపై 2024 ఫలితాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం అవుతుంది. ఇక, కాంగ్రెస్ నాయకత్వంలో, ఒక ప్రధాన మంత్రి అభ్యర్థి నేతృత్వంలో ప్రతిపక్షాలు కలసి పోటీ చేయడం సాధ్యం కాదు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒకే కూటమి ఏర్పాటుకు కూడా ఆస్కారం కనిపించడం లేదు. గుజరాత్ ఎన్నికలలో కేజ్రీవాల్ ఇతర బిజెపి, కాంగ్రెస్‌లతో పోటీపడి రాజకీయ ప్రచారంపై దిగకుండా, రాజకీయ ప్రత్యర్థులపై విద్వేషం వ్యక్తం చేయకుండా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి మౌలిక అంశాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అదే సమయంలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఇటువంటి ప్రచారం వెంటనే ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిన దీర్ఘకాలంలో రాజకీయ వ్యవస్థలో నూతన ఆరోగ్యకరమైన ఒరవడులకు దోహదం చేయవచ్చు. నేడు దేశ వ్యాప్తంగా బిజెపి సంస్థాగతంగా తీవ్రమైన కుమ్ములాటలతో మునిగిపోయి ఉంది. దేశ చరిత్రలో ఎవ్వరూ సమీకరింపలేని వనరులను, అధికార యంత్రాంగం అండదండలతో మోహరింప చేసి, ఉధృతంగా ప్రచారం చేస్తున్న బిజెపిని అదే స్థాయిలో నేడు ఢీకొనే వారు లేకపోయినా, అంతర్గత కుమ్ములాటలే భారీ మూల్యం చెల్లించుకొనేటట్లు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో నిరూపితమైంది.

గుజరాత్‌లో అంతర్గత కుమ్ములాటలు ఫలితాలపై ప్రభావం చూపకుండా స్వయంగా ప్రధాని పర్యవేక్షించ గలగడంతో బిజెపి ఘన విజయం సాధించినా, అన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా చేయడం సాధ్యం కాగలదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సహితం దాదాపు అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌లో సహితం పరిస్థితులు అందుకు భిన్నంగా లేవు. పైగా, లోపాలను సరిదిద్దగల పరిణతి చెందిన నాయకత్వ లోపం ఆ పార్టీలో కనిపిస్తున్నది. గుజరాత్‌లో బిజెపికి బలమైన చోట్ల సహితం పోలింగ్ తక్కువగా జరగడం గమనార్హం. సైద్ధాంతికంగా ఆ పార్టీకి దశాబ్దాల తరబడి కట్టుబడిన ఓటర్లలో పార్టీ పరిపాలన పట్ల కొంత నిర్లిప్తత నెలకొన్నట్లు దేశ వ్యాప్తంగా వెల్లడి అవుతుంది. ఈ నిర్లిప్తత సహితం బిజెపికి పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. కానీ, తమ లోపాలను, తమ పట్ల ప్రజలలో/ పార్టీ శ్రేణులలో నెలకొన్న వ్యతిరేకతను గ్రహించి, వాటిని అధిగమించే విధంగా వ్యూహాలను రూపొందించడంలో మోడీ, అమిత్ షా సిద్ధస్తులుగా పేరొందారు.

అయితే, గుజరాత్‌లో వలే ప్రతికూలతలు సహితం విజయాలుగా మలచుకోగల సౌలభ్యం, ఎత్తుగడలు మిగిలిన రాష్ట్రాలలో ఏమేరకు బిజెపికి సాధ్యం అవుతుందో ప్రశ్నార్ధకమే. ఎన్నికల సమయంకు నూతన రాజకీయ సమీకరణాలు పలు రాష్ట్రాలలో చోటుచేసుకునే అవకాశం ఉంది. బిజెపితో పొత్తు కోసం ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి మినహా దేశం మొత్తం మీద చెప్పుకోదగిన రాజకీయ పార్టీ ఏదీ ఆసక్తి కనబరచడం లేదు. దానితో గత 25 ఏళ్లలో మొదటిసారిగా దాదాపు ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పేరుకు చాలా మిత్రపక్షాలు ఉన్నా రెండంకెల సీట్లలో పోటీ చేసే పక్షాలు ఏవీ లేకపోవడం గమనార్హం.

* చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News