Sunday, November 24, 2024

కమలం ‘మహా’ వికాసం

- Advertisement -
- Advertisement -

ఊహించినట్లుగానే మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయభేరీ మోగించగా, జార్ఖండ్‌లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ జెఎంఎం, కాంగ్రెస్ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికలను అంచనా వేయడంలో బొక్కబోర్లా పడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈసారి కూడా అంత ప్రభావవంతంగా ఫలితాలను అంచనా వేయలేకపోయాయి. మహారాష్ట్రలో మహాయుతి గెలుస్తుందని చెప్పినా, 200కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ఊహించలేకపోయాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మెజారిటీ స్థానాలు కట్టబెట్టిన మరాఠాలు ఆరు నెలలు గడిచేసరికి మనసు మార్చుకోవడం విశేషం.

మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 29 సీట్లను గెలుచుకున్న ‘ఇండియా’ కూటమి ఇదే ఊపును అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావించినా, ఫలించకపోవడానికి షిండే ప్రభుత్వం ‘ముందుచూపు’తో ప్రవేశపెట్టిన ‘లడ్కీ బెహనా యోజన’ పథకం ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌లో బిజెపిని గట్టెక్కించిన లడ్కీ బెహనా పథకమే మహారాష్ట్రలోనూ తమను గెలిపిస్తుందన్న ఎన్‌డిఎ నేతల నమ్మకం వృథా కాలేదు. ఈ పథకం ద్వారా గత ఐదారు నెలలుగా మహారాష్ట్రలోని 21-65 ఏళ్ల మధ్య వయసున్న పేద, అవివాహిత, వితంతు, అనాథ మహిళలు నెలకు రూ. 1500 చొప్పున అందుకుంటున్నారు. ఈ కారణంగా మహిళల ఓట్లు గంపగుత్తగా ఎన్‌డిఎ కూటమికి పడ్డాయి. తాము గెలిస్తే ఈ మొత్తాన్ని మూడువేల రూపాయలకు పెంచుతామన్న మహావికాస్ అఘాడీ నేతల మాటలను మహిళలు విశ్వసించలేదు.

విచిత్రమేమంటే, జార్ఖండ్‌లో ఇలాంటి పథకమే ‘ఇండియా’ కూటమికి మళ్లీ అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించింది. అక్కడ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ‘ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్’ పేరిట మహిళల ఖాతాలో నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తున్నారు. తాము గెలిస్తే ఈ మొత్తాన్ని 2100 రూపాయలకు పెంచుతామన్న ఎన్‌డిఎ నేతల హామీ అక్కడ ఫలించలేదు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 288 సీట్లున్న అసెంబ్లీలో కనీసం ఇరవై సీట్లన్నా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ పనితీరు ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. ఇక రాజకీయాల్లో తండ్రి బాల్ థాక్రే వారసత్వాన్ని తనయుడు ఉద్దవ్ థాక్రే అందిపుచ్చుకున్నా తండ్రిలా ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేయడం ఆయనకు చేత కావటం లేదు. బాల్ థాక్రే ఆశీస్సులతో ఆటోడ్రైవర్ స్థాయినుంచి ఎదిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఏక్‌నాథ్ షిండే పార్టీని చీల్చి బిజెపితో జతకట్టినా, ఓటర్లలో వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు.

దాని ఫలితమే ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం. ఒకటి రెండు సర్వే సంస్థలు మినహా మిగతావన్నీ ఈసారి జార్ఖండ్‌లో బిజెపి కూటమిదే గెలుపని ఢంకా బజాయించి చెప్పాయి. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు ప్రజలలో వ్యతిరేకత పెంచుతుందని బిజెపి భావించినా, జార్ఖండ్ ముక్తిమోర్చా వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలను హేమంత్ సోరెన్‌కు, బిజెపికి మధ్య యుద్ధంలా మలచి, సోరెన్‌కు సానుభూతి పెరిగేలా చేసింది. గిరిజన నేతను అక్రమంగా కటకటాల పాల్జేశారన్న ప్రచారం గిరిజనుల మద్దతు పొందేందుకు దోహదపడితే, 60కి పైగా నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న మహిళలను మయ్యా సమ్మాన్ పథకం ఆకట్టుకుంది. జార్ఖండ్‌లోకి చొరబాటుదారులు ప్రవేశించి జల్, జంగిల్, జమీన్ (నీరు, అడవి, భూమి)ను కొల్లగొడుతున్నారంటూ గిరిజనుల సానుభూతి పొందేందుకు బిజెపి పన్నిన వ్యూహం బెడిసికొట్టింది.

ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామన్న హోం మంత్రి మాటలను సైతం జార్ఖండ్ ప్రజలు విశ్వసించలేదు. వయనాడ్ లో ఘన విజయం సాధించడం ద్వారా తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రియాంక విజయవంతంగా ప్రారంభించారని చెప్పవచ్చు. సోదరుడు రాహుల్ గాంధీని మించి ఆమె మెజారిటీ సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. ఉచిత హామీలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఎన్నికల్లో గట్టెక్కిన మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్‌లో ‘ఇండియా’ కూటములకు ముందుంది ముసళ్ల పండుగ. అలవిమాలిన హామీల అమలు కోసం అప్పులకు తెగబడితే రాష్ట్ర భవిత దెబ్బతింటుందనే వివేచన ప్రభుత్వాలకు లేకపోతే అభివృద్ధి అడుగంటడమే కాదు, ప్రజాజీవనం అతలాకుతలమవుతుంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కొత్త తలనొప్పులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కూటమిలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలూ పదవికోసం పోటీ పడుతున్న నేపథ్యంలో సిఎం పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News