రాళ్లు,కోడిగుడ్డు విసిరిన వైనం
ఎంఎల్‌ఎ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్/ వరంగల్: హన్మకొండలో ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి ఇంటిపై ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల దాడికి దిగారు. ఎంఎల్‌ఎ ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. రాముడి గుడి విరాళాల సేకరణకు అకౌంటబిలిటీ లేదన్న ఎంఎల్‌ఎ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో ఆగ్రహించిన బిజెపి కార్యకర్తలు ఎంఎల్‌ఎ నివాసం దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి నేతలను, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బిజెపి నేతలు శ్రీరాముడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ పరకాల ఎంఎల శ్రీ చల్లా ధర్మారెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. శ్రీరాముడి పవిత్రతను బిజెపి అపవిత్రం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ఆదివారం నాడు పరకాలలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బిజెపి వాళ్లే కాదు తాము కూడా హిందువులమే అంటూ కమలనాథులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజెపి దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో..? లెక్కలు చెప్పాలని చల్లా ప్రశ్నించారు.
ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే 29 రాష్ట్రాల్లో రూ. 29 వేలకోట్లు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించిన మీరు ఇప్పుడు శ్రీరాముడి గుడిని నిర్మించలేరా ? అని కమలనాథులపై చల్లా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందన్నారు. రాముడిగుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదన్నారు. రాముడు అందరి వాడు హిందువైనా ప్రతి వారు రాముని పూజిస్తారని, రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
భద్రాద్రి భూములను ఎపి అప్పగించారు:
భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలని ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా అని అన్నారు. బిజెపి వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేస్తుందని వరంగల్ ఎంపి దయాకర్ అన్నారు. ఖాజీపేటలో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటుకు, వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట లో టెక్స్ టైల్స్ పరిశ్రమకు నిధులు కేటాయించేందుకు కేంద్రంపై వత్తడి చేస్తామని స్పష్టం చేశారు.
లెక్కలడిగితే దాడి చేస్తారా?
రామమందిరం పేరిట వసూళ్లకు పాల్పడుతున్న బిజెపి నేతలను లెక్కలు అడిగితే ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడతారా అంటూ టిఆర్‌ఎస్ నేతలు బిజెపి కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడిచేసిన ఘటనపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎ ఇంటిపై దాడి జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని భద్రతను ఏర్పాటు చేశారు.