Thursday, January 23, 2025

ప్రశ్నించే కంఠాలను కాపాడుకుందాం

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టులు సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, తమదైన శైలిలో కొన్ని వర్గాలకైనా ఉపయోగపడుతుందనే ఆకాంక్ష, ఆరాటం తో చేసే రచనలు, ప్రసంగాలు, పత్రికా కథనాలు, ప్రచురణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలే గానీ తమ వైఫల్యాలు బయట పడుతున్నాయని భయపడి, తమ మనుగడకు ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తిం చి, నైతికంగా గెలవలేక దొడ్డి దారిలో బెదిరించడం అమానుషం. అయితే ప్రశ్నించే గళాలను లొంగదీసుకోవడం, వెంటాడి, వేటాడి భయపెట్టడం వంటి చర్యలకు ఎక్కడ ఎవరు పాల్పడినా చరిత్ర వారిని క్షమించదు. పాలనా లోపాలు, ఎన్నికల వైఫల్యాలు, వాగ్దానాలు, ప్రలోభాలు, హామీల పేరుతో ప్రజలను మోసగిస్తున్న విధానాలు, ప్రజాధనం దుర్వినియోగం, ప్రభుత్వ సంస్థ ల నిర్వీర్యం వంటి అనేక అంశాల పైన ప్రజలు ఓడిపోతున్న ప్రతి విషయాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేయడం నేరం ఎలా అవుతుందో నేడు మతతత్వ శక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

అవును రాజ్యం ఇప్పుడు/ బానిసత్వాన్ని కోరుకుంటుంది/ వర్ణ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుంది/ మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ వెలికి తీస్తుంది/ మానవత్వాన్ని చంపుతూ/ మనిషిని హత్య చేస్తుంది/ చివరికి…/ దేశ సంపదను కార్పోరేట్/ చేతులకి అమ్ముతుంది/నిజానికి దేశాన్ని పరిపాలించేది/ రాజకీయ నాయకులు కాదు/ ఆదానీలు, అంబానీలు/ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, దళారీలు పరాన్న జీవులు/ మనిషి గొంతు పై నిలబడి/ మానవాళి శ్వాసను నలిపేస్తున్నాయి/ మిత్రమా..!!/ ఇంకా ఎంతకాలమని/ అలా అంధకారపు నిద్రలో/ అమాయకపు జోలపాటకి/ అసమర్థ్యంగా నిద్రపోతుంటావు/ లే…
ఈ దేశపు మార్పు మనతోనే మొదలవాల్సి ఉన్నదని ఓ విప్లవ కవి చెప్పినట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్, ప్రాణహాని దాడుల బెదిరింపులు అన్నీ నేటి ఫాసిస్టు ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, శక్తులపై దాడి చేయడం బిజెపి అధికారంలోకి వచ్చాక పరిపాటిగానే మారింది.

గతంలో సల్మాన్ రష్మీ, అరుంధతి రాయ్, తస్లీమా నస్రీన్ తదితరుల పైన ఇదే పద్ధతులలో మత శక్తులు, వారి భావాలను అంగీకరించనటువంటి కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు, ఇతర సంస్థలు ఫత్వా తదితర పద్ధతుల ద్వారా వారి ప్రాణాలు తీయడానికి పిలుపునివ్వడం జరిగింది. అదే విధంగా కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంఖేష్, దబోల్కర్ తదితర మేధావులు, సామాజిక ఉద్యమకారులను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ మతోన్మాద మూకలే హత్య చేసినటువంటి ఘటనలు మరచిపోక ముందే ఆ దాడుల పరంపర కొనసాగింపే ఈనాటి తులసి చందుపై ప్రాణహాని బెదిరింపులు.
ప్రజాస్వామ్యంలో సామూహిక, సామాజిక వ్యవస్థాపరమైన అంశాలపైన బాధ్యతాయుతంగా స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం వాక్ స్వాతంత్య్రం అంటే తన అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మోహమాటంగా వ్యక్తం చేసే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

అయితే వ్యక్తిగత దూషణలు కాకుండా వ్యవస్థాపరమైన లోపాలు, పాలనాపరమైన వైఫల్యాలు, కొన్ని వర్గాల పైన జరుగుతున్న దాడులు, అసమానతలు, అంతరాలు దోపిడీ, పీడన కొనసాగుతున్నటు వంటి సమాజంలోని బలహీనతల పైన, బలవంతుల అకృత్యాల పైన స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అయితే అందుకు అవగాహన, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ధైర్యం, సమర్ధించుకునే ప్రతిభ, పరిష్కారాలు చూపగలిగిన ప్రజ్ఞ, సమన్వయ పరచగలిగే నేర్పు, అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేయగల స్థితప్రజ్ఞత వంటి లక్షణాలు ఉన్నవాళ్లు మాత్రమే మరింత ముందుకు వెళ్లి ప్రజాక్షేత్రంలో విమర్శిస్తూ పాలకులు, ప్రజలలో తమ బాధ్యత మరిచిన ప్రతి వ్యక్తిని తట్టి లేపుతారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొంత కాలంగా ప్రజా క్షేత్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కతిక, పాలనాపరమైన అంశాల పైన తనదైన శైలిలో హేతుబద్ధంగా ఆలోచిస్తూ, కారణాలను విశ్లేషిస్తూ, పరిష్కారాలు సూచిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకుపోతున్న విషయాన్ని మనం గమనించాలి. ఆమె ప్రసంగాలు ప్రజాస్వామిక వాదులకు, ప్రజాస్వామ్య శక్తులకు, ప్రజాసంఘాలు, అఖిల పక్షాలు, మేధావులు, రచయితలు, మెరుగైన సమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ నిరంతరం కాంతిని ప్రసరిస్తూనే ఉన్నాయి.

అయితే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు మేరకు తన ప్రతిభ ఆధారంగా సమీకరించిన జ్ఞానాన్ని ప్రజలకు వివరించి చెప్పినప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. జర్నలిస్టులు సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, తమదైన శైలిలో కొన్ని వర్గాలకైనా ఉపయోగపడుతుందనే ఆకాంక్ష, ఆరాటంతో చేసే రచనలు, ప్రసంగాలు, పత్రికా కథనాలు, ప్రచురణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలే గానీ తమ వైఫల్యాలు బయట పడుతున్నాయని భయపడి, తమ మనుగడకు ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తిం చి, నైతికంగా గెలవలేక దొడ్డి దారిలో బెదిరించడం అమానుషం. అయితే ప్రశ్నించే గళాలను లొంగదీసుకోవడం, వెంటాడి, వేటాడి భయపెట్టడం వంటి చర్యలకు ఎక్కడ ఎవరు పాల్పడినా చరిత్ర వారిని క్షమించదు. పాలనా లోపాలు, ఎన్నికల వైఫల్యాలు, వాగ్దానాలు, ప్రలోభాలు, హామీల పేరుతో ప్రజలను మోసగిస్తున్న విధానాలు, ప్రజాధనం దుర్వినియోగం, ప్రభుత్వ సంస్థ ల నిర్వీర్యం వంటి అనేక అంశాల పైన ప్రజలు ఓడిపోతున్న ప్రతి విషయాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేయడం నేరం ఎలా అవుతుందో నేడు మతతత్వ శక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

తాత్కాలికంగా అస్త్ర బలం, అంగ బలం, ధన బలం, అధికార బలంతో అణచివేయాలని కుట్ర పన్నినా శాశ్వతంగా ఓటమే అని గుర్తిస్తే మంచిది. పరువు ప్రతిష్ఠలు దిగజారినప్పుడు, వ్యక్తిగత విమర్శ చేసినప్పుడు నిలదీసి అడిగినా తప్పులేదు గానీ సామూహిక అంశాలపైన బాధ్యతాయుతంగా మాట్లాడినప్పుడు బెదిరించడం అంటే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని గ్రహించడమే కదా! హెచ్చరించడం అంటే తమ లోపాన్ని అంగీకరించడమే. అసహనం వ్యక్తం చేయడమంటే సహించే తత్వాన్ని కోల్పోవడమే అని ఆ వర్గాలు గుర్తిస్తే మంచిది. వర్గ పోరాటం ప్రతి చోట అనివార్యమైన నేపథ్యంలో ప్రశ్నించే వాళ్లను, ప్రజలను చైతన్యపరిచే మేధావులను బెదిరించే వాళ్ళు ఉంటారనే సోయి, ఆలోచన ప్రజలకు, ప్రజా ఉద్యమకారులకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీపాన్ని కాపాడుకుంటేనే వెలుగును పంచినట్లు సమర్థులు, ప్రతిభావంతులు, సామాజిక బాధ్యత గల కొన్ని వర్గాలను కాపాడుకోవడం ద్వారా మాత్రమే భావితరాలకు కూడా భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళమవుతాము. ప్రజా చైతన్యాన్ని ఇనుమడింప చేసుకోవడం ద్వారా అసాంఘిక శక్తులను అడ్డుకునే క్రమంలో ఉద్యమ కార్యాచరణకు పూనుకున్నప్పుడు మాత్రమే ఆ శక్తులు బలహీనమవుతాయి. తమ లోపాలు, వైఫల్యాలను మనసులోనైనా అంగీకరించి తలవంచుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రజల కోసం పని చేసే ఇలాంటి వారిని ప్రజలే కాపాడుకోవాలి.

అది వారి కనీస బాధ్యతగా కూడా ఉండాలి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఎక్కడికక్కడ ఇలాంటి బెదిరింపులు, మందలింపులను ఖండిస్తూ నైతిక మద్దతు ప్రకటించడం తమ వాణిని బలంగా వినిపించడమే నేడు మన ముందున్న తక్షణ కర్తవ్యం. జర్నలిస్టు తులసీ చందు కూడా వాస్తవాలను తెలిపినందుకు, ధైర్యంగా మాట్లాడినందుకు తన కుటుంబానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని అయినప్పటికీ తన లక్ష్యం నుండి వైదొలిగే ప్రసక్తే లేదని చేసిన ప్రకటన ఇప్పటికైనా మతతత్వ వాదులకు, అసాంఘిక శక్తులకు చెంపపెట్టుగా పరిణమిస్తుందని ఆశిద్దాం. అదే సందర్భంలో ఆమెకు అన్ని విధాల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఆమెకు ఎటువంటి హాని జరిగినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సామాజిక ఉద్యమకారులు, హేతువాదులు, లౌకికవాదులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు తదితర ప్రశ్నించే వారిని, సత్యశోధన చేసే వారిని సమాజ మేలు కోరే ప్రతి ఒక్కరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాల పైన, ప్రజల పైన ఉన్నది.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News