Wednesday, January 22, 2025

పోలింగ్ బూత్‌ల లూటీకి బీజేపీ యత్నం : అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

ఎటవా (యుపి) : మణిపూర్‌లో లోక్‌సభ నియోజక వర్గంలో పోలింగ్ బూత్‌లను కాజేయడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని, అందుకనే విపక్షసభ్యులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆరోపించారు. ఈ లోక్‌సభ స్థానానికి మూడో దశలో మంగళవారం పోలింగ్ జరిగింది. మణిపూర్ నియోజక వర్గం లోని సైఫై (ఎటావా) వద్ద అఖిలేశ్ ఓటు వేశారు.

ఈ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపిల్ యాదవ్ పోటీలో ఉన్నారు. బీజేపీలో అధికారం కోసం అంతర్గత పోరు సాగుతోందని, అందుకనే ఆ నాయకులు స్వయం బుజ్జగింపు ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరుగుతోందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను ఉపయోంచుకుంటోందని సమాచారం అందిందన్నారు. పోలింగ్ బూత్‌లకు బయట అధికారులు నియామకమయ్యారని ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదించిన మూడు కొత్త వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో వెయ్యిమందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా, కనీస మద్దతు ధర కల్పించడం లేదని ధ్వజమెత్తారు.

2021లో లఖింపూర్ ఖేర్ హింసాత్మక సంఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ రైతుల మీదుగా కేంద్రమంత్రి కారు నడిపించారని ఆరోపించారు. ఆ కారులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని పేర్కొన్నారు.. “ ఈ నాయకులు రైతుల మీదుగా కార్లు నడుపుతారని , 2014లో బీజేపీ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. నిప్పులు చెరిగే ఎండల్లో ఎన్నికలు నిర్వహించడం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని విమర్శించారు. ఏదేమైనా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఓటును వేయాలని కోరారు. ఈ ఓటు ప్రజల జీవితాలనే మారుస్తుందని, ఇదే ఓటు రాజ్యాంగాన్ని, ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్‌పి నేత రామ్‌గోపాల్ యాదవ్ కూడా సైఫైలో ఓటు వేశారు.

బీజేపీ మళ్లీ అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. బీజేపీ కొత్త రాజ్యాంగం కోసం సిద్దమైందని, ఎవరైనా అధికారం లోకి వస్తే నియంతృత్వం దిశగా ముందుకు వెళ్తారని రామ్‌గోపాల్ విమర్శించారు. ఈ ఎన్నికలు రామభక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించగా, అధికార మత్తులో మునిగితే ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడుతాడని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోరాటం దేశాన్ని రక్షించుకోవడానికని , డింపిల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో మణిపూర్ స్థానాన్ని గెల్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News