రాహుల్ గాంధీ ఆరోపణ
గోల్‌పోఖర్(ప బెంగాల్): పశ్చిమ బెంగాల్‌ను సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)గా మారుస్తామన్న బిజెపి వాగ్దానాన్ని ఎండమావిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. భాష, మత, కుల, జాతి ప్రాతిపదికన ప్రజలను చీల్చి విద్వేషం, హింసను పంచడం తప్ప బిజెపికి ఏమీ చేతకాదని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బుధవారం నాడిక్కడ తన తొలి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. మమతకు చెందిన టిఎంసిలాగా తమ పార్టీ(కాంగ్రెస్) ఎన్నడూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోదని ఆయన స్పష్టం చేశారు. గతంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎతో టిఎంసి చేతులు కలిపి అధికారాన్ని పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బెంగాల్ సంస్కృతిని, చారిత్రక వారసత్వాన్ని ధ్వంసం చేయడానికి బిజెపి పూనుకుందని ఆయన ఆరోపించారు. అస్సాంలో కూడా ఆ పార్టీ అదే పని చేస్తోందని ఆయన అన్నారు. తమిళనాడులో కూడా తన మిత్రపక్షమైన ఎఐఎడిఎంకెతో కలసి అదే పని చేయడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. విద్వేషాన్ని, హింసను, విచ్ఛిన్నకర రాజకీయాలు తప్ప బిజెపికి ఏవీ చేతకాదని ఆయన దుయ్యబట్టారు. బిజెపి చేస్తున్న సోనార్ బంగ్లా వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ అదో ఎండమావని, అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి కలలనే బిజెపి అమ్ముతోందని రాహుల్ ఎద్దేవా చేశారు.