Friday, December 20, 2024

రిజర్వేషన్‌లను తొలగించేందుకు బిజెపి యత్నం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

రిజర్వేషన్‌లను తొలగించేందుకు బిజెపి యత్నం
రిజర్వేషన్‌ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు
వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి
కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం
వనరులను సమానంగా పంచుతాం
సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోంది
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బిజెపి యత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని, రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయన్నారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తిని, తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం వనరులను సమానంగా పంచుతామని ఆయన తెలిపారు.

వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని ఆయన తెలిపారు. దేశంలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బిసిలపై ఉందని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బిజెపి నేతలు 400 సీట్లు కోరుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోందని, జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నటిస్తోంది
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణనపై విధాన నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి కాంగ్రెస్ పునాదులే కారణమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బిజెపికి స్థానం లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి అధికారంలోకి రాకుండా బలహీనవర్గాలు పోరాటం చేయాలని ఆయన కోరారు.

దేశంలో 90 శాతం ప్రజల హక్కులు కాల రాసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందన్నారు. హక్కులు కాపాడుకునేందుకు ఓటు ద్వారా కాంగ్రెస్‌ను నిలబెట్టాలన్నారు. బిజెపికి ఓటు వేస్తే ప్రజలకు భవిష్యత్ లేకుండా పోతుందన్నారు. బిజెపి హయాంలో దేశ ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింద న్నారు. దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నటిస్తోందని, దేశ సంపదను కొందరికి కట్టబెడుతూ ప్రజలను బానిసలుగా చేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని ఉపముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క ఆరోపించారు.

ప్రస్తుతం కావాల్సినంత కరెంట్ ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వంలో కావాల్సినంత కరెంట్ ఉందని, ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చినా విద్యుత్ శాఖ ఉద్యోగులు సమర్ధంగా విధులు నిర్వహిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అందువల్ల విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో 06వ తేదీ వరకు నమోదైన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు 52.9 శాతం పెరుగుదల నమోదయిందన్నారు.

మే 2023లో 7,062 మెగావాట్లుగా ఉన్న సరాసరి డిమాండ్ 10,799 మెగావాట్లకు పెరిగిందన్నారు. అలాగే సరాసరి వినియోగం సైతం 157.9 మిలియన్ యూనిట్ల నుంచి 226.62 మిలియన్ యూనిట్లకు పెరిగి, 43.5 శాతం పెరుగుదలగా నమోదు చేసిందన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది మే నెల ఆరు వరకు నమోదైన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు 47.6 శాతం పెరుగుదల నమోదయ్యిందన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలోనూ రైతులు రోడ్డ మీదకు…
బిఆర్‌ఎస్ హయాంలో రైతులు రోడ్డ మీదకు వచ్చి ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా అంటూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను భట్టి ప్రశ్నించారు. అప్పట్లో విద్యుత్ శాఖ పట్ల బిఆర్‌ఎస్ అనుసరించిన తీరును సాక్షాత్తు అప్పటి ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు మీడియా ముఖంగా ఎండగట్టిన విషయం మర్చిపోయారా అంటూ ఆయన నిలదీశారు. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్ విద్యుత్ పట్ల చేస్తున్న దుష్ప్రచారం చాలా హేయకరమయ్యిందని ఆయన విమర్శించారు.

నిజాలు మాట్లాడితే బిజెపి బెదిరింపులకు దిగుతోంది
కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులను తమ ఆధీనంలో ఉంచుకున్న బిజెపి ప్రభుత్వం నిజాలు మాట్లాడిన వారిపై బెదిరింపులకు దిగుతోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిల పక్షాన గొంతెత్తిన ముఖ్యమంత్రిని విచారణ పేరుతో ఢిల్లీకి రమ్మంటోందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకైక మార్గమని అన్నారు. అణగారిన వర్గాల రిజర్వేషన్ల రక్షణకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా పేరున్న భారత్‌లో డెమొక్రసీ రోడ్డున పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని, బ్రిటీష్ కాలం నాటి రూల్‌ను తెరపైకి తెచ్చి బిజెపి బెదిరిస్తోందన్నారు. ఢిల్లీ సుల్తాన్‌ల మాదిరిగా వ్యవహారిస్తామంటే కుదరదని, ఓటుతో బిజెపి ప్రభుత్వానికి అంతా బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదు
మోడీ పాలనలో దేశం అల్లకల్లోలం అయ్యిందని, బిజెపి అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత బడుగు, బలహీన వర్గాలదేనని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసిపోయాయన్నారు. కెసిఆర్ బిజెపికి వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదన్నారు. రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News