Wednesday, January 22, 2025

కశ్మీర్‌లో బుల్డోజర్ రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లో పత్రికలపైన, పౌరులపైన హింస పెరిగిపోయింది. భావప్రకటనా స్వేచ్ఛపై కోత పడింది. వివాదాస్పద ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంగా భారత ప్రభుత్వం దీన్ని సమర్థిస్తోంది. సుహైల్ అహ్మద్ షాకు, అతని కుటుంబానికి ఇరవై ఏళ్ళుగా తిండి పెడుతున్న ఆ ప్రాంతంలో శిథిలాల మధ్య నిరాశగా అతను నిలుచుండిపోయాడు.ఆ వర్క్‌షాప్‌లో రెండు గంటల క్రితం వరకు తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇంతలో ఒక భీకరమైన శబ్దం చేస్తూ తన వర్క్‌షాప్ కప్పు రేకులు ధ్వంసమైపోయాయి.కొద్ది సేపట్లోనే ఆ ప్రాంతాన్నంతా బుల్డోజర్ నేలమట్టం చేస్తున్న సమయంలో కాస్తలో తప్పించుకున్నాడు. “మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అధికారులు ఉన్నట్టుండి ఊడిపడ్డారు. వర్క్‌షాప్‌ను ధ్వంసం చేశారు. మా గోడు అరణ్య రోదనే అయిపోయింది. మేం అద్దె కడుతున్నాం. మా నోటికాడి కూడును తీసేశారు. ఇది అణచివేత కాదా?” అని వాపోయాడు 38 ఏళ్ళ షా. సెకండ్ హ్యాండ్ కారు విడిభాగాలు తయారు చేసి అమ్మే వర్క్‌షాప్ అది. భారత దేశాన్ని భయపెడుతున్న కశ్మీర్ రాష్ర్ట రాజధాని శ్రీనగర్‌లో జరిగిన సంఘటన ఇది.

గత ఫిబ్రవరిలో ఈ ప్రాంతంలో జరిగిన డజను నిర్మాణాల కూల్చివేతలో ఇదొకటి. దశాబ్దాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిలో పని చేసుకుంటున్న వీరిలో కొందరికి నోటీసులు వచ్చాయి. చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ జాగాను తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసమే ఈ పనికి పూనుకొన్నట్టు ప్రభుత్వం చెపుతోంది. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. జనాభా రీత్యా కశ్మీర్ రాష్ర్టంలో ముస్లింలు అత్యధికులు ఉన్నారు. అలాంటి కశ్మీర్ రాష్ర్టంలో తమ నేల నుంచి తమను వెళ్ళకొట్టడానికే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద ఎజెండాతో ముందుకు సోగుతోందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి బిజెపి నాయకులకు బుల్డోజర్ ఒక బలమైన ఆయుధంగా తయారైంది. లౌకిక రాజ్యంగా ఉన్న భారత దేశాన్ని హిందూ మత రాజ్యంగా తయారు చేయాలన్న ఆకాంక్షతో ముస్లింలే ధ్యేయంగా ప్రభుత్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అక్రమంగా వలస వచ్చారని ఆరోపిస్తూ ముస్లింల ఇళ్ళను ధ్వంసం చేయడానికి బుల్డోజర్‌ను ఉపయోగించారు. ముస్లింలకు వ్యతిరేకంగానే బిజెపి ‘బుల్డోజర్ రాజకీయాలు’ మొదలు పెట్టిందని కశ్మీర్‌లో భయాందోళనలు వ్యాపించాయి. “వారి ఇళ్ళను, జీవనోపాధిని ధ్వంసం చేయడం ద్వారా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలన్నది ఒక ఎత్తుగడ” అని ఈ విధ్వంసాన్ని మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అభివర్ణించారు.

52 ఏళ్ళ ఫయాజ్ అహ్మద్ 30 ఏళ్ళ బట్టి ఉన్న పాత సామానులు నిల్వ చేసుకునే గోడౌన్‌ను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ధ్వంసం చేశారు. కశ్మీరీలను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని అతని ఆరోపణ. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి కశ్మీర్ భారత్ పాకిస్థాన్‌ల మధ్య నీదా, నాదా అన్నట్టుగా తయారైంది. ఈ వివాదాస్పద నేలపైన తమ ఆధిపత్యం కోసం ఇరు దేశాలు అనేక సార్లు యుద్ధాలకు దిగాయి. భారత దేశం వైపు నుంచి చూస్తే, పాకిస్థాన్ ప్రోద్బలంతో 1990 నుంచి విభజన ఉద్యమం మొదలైంది. హింసను అదుపు చేయడానికి ప్రభుత్వాలు తంటా లుపడ్డాయి. గతంలో హిందూత్వవాదులకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి 2019 ఆగస్టులో మోడీ ప్రభుత్వం కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, దాన్ని రెండు రాష్ట్రాల కింద విడగొట్టి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంది. కశ్మీర్‌లోకి వేలాది మంది భద్రతా దళాలను దింపింది. రాష్ర్ట ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 18 నెలల పాటు స్థానిక రాజకీయ నాయకులను జైళ్ళ లో నిర్బంధించారు. ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను తొలగించారు.
కశ్మీర్ తలుపులను బయటి వారి కోసం బిజెపి ప్రభుత్వం బార్లా తెరిచింది.కశ్మీర్‌లో ఆస్తులను బయటివారు కొని, ఓటర్లుగా నమోదయ్యారు. ఫలితంగా 20 లక్షల నూతన ఓటర్లు వచ్చి చేరారు.

ప్రస్తుతం ముస్లిం మెజారిటీ రాష్ర్టంలో జనాభాను ప్రభుత్వం మార్చేస్తోందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రయోజనం కోసం ముస్లిం ఓటర్లను విభజించి, నియోజక వర్గాల సరిహద్దులను పునర్లిఖించి, ఎన్నికల చిత్రపటాన్ని మార్చేస్తోంది. కశ్మీర్‌లో 2019 నుంచి చేపట్టే చర్యలన్నీ శాంతిని నెలకొల్పడానికేనని బిజెపి చెపుతోంది. “పెట్టుబడులు వస్తున్నాయి, పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఐక్యతలో దేశంతో పాటు కశ్మీర్ నిదానంగా సాధారణ స్థితికి వచ్చేస్తోంది” అని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ర్ట ప్రజల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఒక క్రమానుగతంగా ఆధిపత్య చట్టాలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామిక స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ ప్రాతినిధ్యం, నిరసన తెలిపే హక్కు వంటివన్నీ కాలరాస్తున్నారు. కశ్మీర్ ప్రపంచంలోనే అత్యధిక సైనికీకరణ జరిగిన ప్రాంతమైపోయింది. 70 లక్షల జనాభాను అదుపు చేయడానికి 5 లక్షల భద్రతా బలగాలను దించారు. కొద్ది మైళ్ళకే రోడ్లలో చెక్‌పోస్టులు పెట్టారు.

పత్రికలపైనే కాకుండా సాధారణ ప్రజలపైన కూడా ఆంక్షలు విధించడం ప్రభుత్వ విధానంగా మారింది. సామాజిక మాధ్యమా ల ద్వారా ఆచరణలో పోలీసులను, సైన్యాన్ని విమర్శిస్తే వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసేసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రహస్యంగా మాట్లాడుకుంటున్నా రు. బహిరంగంగా మాట్లాడడానికి భయపడుతున్నారు. “ఒక భయం అలుముకుంది.ఎవరైనా కనీసం సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా పోలీసు చర్యలను ఎదుర్కోవలసి వస్తోంది. జైలులో జీవితాన్ని ముగించాలని ఎవరూ కోరుకదా” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక విద్యార్థి అన్నాడు. తన స్నేహితుడు ఫేస్‌బుక్‌లో ఒక విషయం రాసినందుకు పోలీసులకు కోపం వచ్చి నిరంకుశమైన భద్రతా చట్టాలననుసరించి జైల్లో పెట్టారని వాపోయా డు. ముఖ్యంగా జర్నలిస్టులే వారి ధ్యేయం. వారి రిపోర్టింగ్‌ను అదుపు చేయడానికి కొత్త చట్టాలు వచ్చాయి.

కీలకమైన వార్తలు రాసినందుకు కొంత మంది జర్నలిస్టుల ఫోన్‌లను, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని, వారిని ఇంటరాగేషన్ చేసి వేధించారు. పోలీసులు జర్నలిస్టులను బహిరంగంగా కొడుతున్నారు. విమానాలెక్కి విదేశాలకు వెళ్ళిపోకుండా కొందరిపై నిషేధం విధించారు. ఎడిటర్లు, పత్రికా యజమానులు ప్రభుత్వంపై విమర్శలొచ్చే వార్తలను తొలగిస్తున్నారు. ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించే పత్రికలు కూడా ప్రభుత్వం విడుదల చేసిన సమాచారంతో వాటికి కరపత్రాల్లా తయారయ్యాయి. అసిఫ్ సుల్తాన్, ఫహద్ షా, సజద్‌గుల్ వంటి కాశ్మీరీ జర్నలిస్టులు తీవ్రవాద చట్టాల కింద జైళ్ళపాలయ్యారు.“మా సోదరుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు” అని సజద్ గుల్ సోదరుడు జవైద్ అహ్మద్ తెలిపాడు. “అతన్ని అత్యున్నత భద్రత గదిలో ఉంచి, ప్రమాదకరమైన నేరస్థుడిలా చూస్తున్నారు. అతను ఇంటికి ఫోన్ చేయడానికి వీలు లేదు. కనీసం పెన్ను డైరీని కూడా అనుమతించడం లేదు” అని పేర్కొన్నాడు.

ప్రజాస్వామ్యం అంతుచిక్కనిదిలా తయారైంది. రాష్ర్ట ప్రభుత్వం 2019 తరువాత ఎన్నికలను పునరుద్ధరించలేదు. కశ్మీర్‌లో తమ నిరసనను వ్యక్తం చేయడానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఎన్నికలు అయిదేళ్ళుగా లేవు. భారత విధానాలకు అనుకూలం గా తమ రాజకీయ స్థానాలను పెంచుకుంటూపోయి, 2019 తరువాత జైలు పాలైన రాజకీయ నాయకులు కూడా బిజెపి ప్రభుత్వ ఆధిపత్య వాదాన్ని విమర్శిస్తున్నారు. అధికారాలే తప్ప జవాబుదారీతనం లేని పాలనాధికారులను ప్రభుత్వం కశ్మీర్‌కు నియమించిందని మాజీ ముఖ్యమంత్రి, విదేశీ వ్యవహారాల మాజీ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. “నా పార్టీలో ఉన్న వారిని అంతులేకుండా వేధిస్తున్నారు” అని మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ ఆరోపించారు. “బాధల్లో ఉన్న ప్రజల వద్దకు చేరుకోనీయకుండా నన్ను గృహ నిర్బంధంలో ఉంచి, రాజకీయ కార్యకలాపాలు లేకుండా చేశారు” అని తెలిపారామె. “రాజకీయ కార్యకర్తలకు గాని, జర్నలిస్టులకు గాని క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవడానికి లేకుండా భావ ప్రకటనా స్వేచ్ఛను తుంచేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కశ్మీర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, తులిప్ గార్డెన్‌లను, సరస్సులను, మంచు జారే కొండ ప్రాంతాలను చూస్తే శాంతి నెలకొందని, అభివృద్ధి జరుగుతోందని భావించవచ్చని బిజెపి నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారు. రాష్ర్టంలో వ్యాపార పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే, 2019లో చేపట్టిన ధ్యేయం ఇప్పటికీ చేరుకోలేదు సరికదా, ప్రైవేటు పెట్టుబడులు 2018 నాటికంటే సగం కూడా లేవు. ఆర్థిక సమస్యలు, ముఖ్యం గా నిరుద్యోగం తెగులు పట్టినట్టు పాకుతోంది. మిలిటెంట్లు ఎత్తుగడలను మార్చుకున్నారు. స్థానికేతరులు, మైనారిటీలైన కశ్మీరీ హిందువులను చంపుతున్నారు. కశ్మీర్ అనుకూల దురాక్రమణ హింస వల్ల కశ్మీర్ లోయను 1990లో విడిచి వెళ్ళిన 65 వేల మంది పండిట్లను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పండిట్లు తరలిపోవడం మొదలైంది.

“కశ్మీర్‌లో మేం క్షేమంగా ఉంటామని అనుకోవడం లేదు” అని ఇటీవల జరిగిన హత్యల తరువాత వెళ్ళిపోయిన వారిలో ఒకరైన రింకు భట్ అంటారు. “పట్టపగలు, ఆఫీసుల్లో, ఇళ్ళలో కాల్చిచంపారు. సురక్షితమైన ప్రాంతాలకు మమ్మల్ని బదిలీ చేయాలని కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అంటాడాయన. ఈ ఆరోపణలను బిజెపి నాయకుడు, డిప్యూటీ మాజీ ముఖ్యమంత్రి కవిందర్ గుప్త తోసిపుచ్చుతూ, తీవ్రవాదం అదుపులో కొచ్చిందని, రాష్ర్ట ఎన్నికలు త్వరలో జరుగుతాయని చెప్పాడు. “కశ్మీర్‌లో శాంతి నెలకొంది. గతంలోలా రాళ్ళు విసరడం, నిరసనలు తెలపడం లేదు” అని గుప్త అన్నారు. “పాకిస్థాన్ ఎజెండాతో వారి జెండాలను ఎగరేసే వారికి గత ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. కశ్మీర్‌లో చేపట్టే చర్యలు చాలా అవసరం. ఫలితం మన ముంగిటే ఉంది” అని బిజెపి నాయకుడు కవిందర్ గుప్త అంటారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News